ఆంక్షల చట్రం | - | Sakshi
Sakshi News home page

ఆంక్షల చట్రం

May 15 2026 12:31 PM | Updated on May 15 2026 12:31 PM

వ్యయసాయ యాంత్రీకరణ పథకానికి సీఎం చంద్రబాబు తూట్లు గతేడాది రైతులకు ఒక్క పరికరం కూడా ఇవ్వని కూటమి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాకు రూ.7.35 కోట్లే కేటాయింపు ఆసక్తి గల రైతులు మాత్రం లక్షల సంఖ్యలో.. అడుగడుగునా ఆంక్షలతో అన్నదాతలకు అడ్డంకులు ఇ–క్రాప్‌ నమోదులో పేరు లేకుంటే పథకానికి అనర్హులంటూ ప్రకటన సిఫార్సు ఉంటేనే వ్యవసాయ పనిముట్లు పొందే అవకాశమంటూ ఆరోపణలు

యంత్రం..

కూటమి వారికే వ్యవసాయ పరికరాలు

ఏ ప్రభుత్వమైనా రైతులకు సంబంధించిన పథకాలు అమలుచేసే సమయంలో పార్టీలు చూడకూడదు. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం తమ పార్టీ సానుభూతిపరులకే వ్యవసాయ పరికరాలు అందించేలా పథకం అమలు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రైతులందరికీ కాకుండా కొందరికే వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేలా పథకాన్ని రూపొందించడం శోచనీయం. ఆన్‌లైన్‌ దరఖాస్తులు తొలుత ఇన్‌చార్జి మంత్రికి పంపడమేమిటి.. అనంతరం జేసీ లాగిన్‌కు రావడం ఏమిటి..? అర్హులైన వారందరికీ పరికరాలిచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా.? ఇదంతా చూస్తుంటే అన్నదాతకు వెన్నుపోటు పొడిచే విధంగా ఉంది.

– డాక్డర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌,

వైఎస్సార్‌ సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి

రైతులను ఆదుకోవాలి

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఉన్న ఇ–కేవైసీ నిబంధనలు ఎత్తివేసి జిల్లాకు కనీసం రూ.20 కోట్లు బడ్జెట్‌ కేటాయించాలి. రైతులకు అవసరమైన పనిముట్లను సకాలంలో అందరికీ అందించాలి. పంట నష్టపరిహారం కూడా త్వరగా చెల్లించాలి. గతేడాది తుఫాన్లకు పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభానికి ముందే వ్యవసాయ రుణాలు ఇవ్వాలి.

– ఉడుముల కోటిరెడ్డి,

వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ మెంబర్‌

మార్కాపురం/అద్దంకి:

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు ఒక్క వ్యవసాయ పనిముట్టు కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది పథకం అమలు చేస్తామని చెప్పడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లక్షల మంది రైతులు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రభుత్వం కేటాయించిన అతి తక్కువ బడ్జెట్‌తో పాటు విధించిన ఆంక్షలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడ్జెట్‌లో రూ.7.35 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది. కానీ, ఉమ్మడి జిల్లాలో 2,69,635 మంది రైతులుండగా, దాదాపుగా 1,42,349 హెక్టార్లలో ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగు ఉంటుందని అంచనా వేశారు. మార్కాపురం జిల్లాలో 1,53,660 మంది రైతులుండగా ఈ ఏడాది 86,349 హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు చేయవచ్చని అంచనా వేశారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో 1,15,975 మంది రైతులు ఉండగా, 56 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు ఉండొచ్చని అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, సజ్జ, జొన్న, తదితర పంటలు సాగుచేయనున్నారు.

రైతులకు శాపంగా మారిన నిబంధనలు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దాదాపు 7.35 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో మార్కాపురం జిల్లాకు రూ.3.15 కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.4.20 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు చూస్తేనే ఏమాత్రం సరిపోవని అర్థమవుతోంది. ప్రధానంగా ఇ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం విధించిన నిబంధన సాధారణ రైతులకు శాపంగా మారింది. ఇందులో 5 ఎకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, 5 ఎకరాలు పైబడిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తారు. మరొక నిబంధన ప్రకారం 3 సీజన్లలో ఇ క్రాప్‌ తప్పనిసరిగా నమోదు చేసుకుని ఉండాలి. ప్రధానంగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, పోస్టు హార్వేస్టు, తైవాన్‌ స్ప్రేయర్లు, హార్వెస్టింగ్‌ పనిముట్లు, విత్తనపు గొర్రులు ఇలా 9 రకాల పనిముట్లు అందజేస్తారు.

రైతుల ఎంపిక తీరుపై తీవ్ర విమర్శలు...

ఈ నెల 19 తుది గడువుగా పేర్కొన్నప్పటికీ సర్వర్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వివరాలన్నీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి లాగిన్‌కు వెళ్లి అక్కడ పరిశీలన అనంతరం జేసీ లాగిన్‌కు వస్తాయి. లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే, ఇక్కడే తిరకాసు ఉంది. ఇ–క్రాప్‌లో నమోదైన రైతులందరికీ గ్యారంటీగా పరికరాలు వస్తాయని లేదు. మంత్రి లాగిన్‌, అక్కడి నుంచి జేసీ లాగిన్‌కు వస్తాయి. లాటరీ ద్వారా ఎంపిక చేస్తామనే విధానం పట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనివలన అర్హులైన రైతులకు రికమెండేషన్‌ ఉంటేనే యాంత్రీకరణ పథకం వస్తుందని అర్థమవుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,69,635 రైతులుంటే.. బడ్జెట్‌లో 7.35 కోట్ల రూపాయలే కేటాయించారని, అవి ఏమాత్రం సరిపోవని, అందుకే రైతుల సంఖ్య తగ్గించేందుకు ఎంపిక ప్రక్రియను లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఖరీఫ్‌ సీజన్‌ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కువగా మినీ ట్రాక్టర్లు, ట్రక్కులు, విత్తనపు గొర్రులు, తైవాన్‌ స్ప్రేయర్లపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. మండల కేటాయింపులు తక్కువ స్థాయిలో ఉండటం, రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో సిఫార్సు ఉన్నవారికే వ్యవసాయ పనిముట్లు వస్తాయనే భావనతో పలువురు ఆసక్తి చూపడం లేదు. నిబంధనలు సడలించి బడ్జెట్‌ పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement