● రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు పాలనలో గిట్టుబాటు ధర లభించక రైతులు కుదేలవుతున్నారని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యంతో మొక్కజొన్న, పొగాకు, మిర్చి, ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. వ్యాపారులతో కుమ్మకై ్క ఫీడు ధరలు పెంచడం దారుణమన్నారు. దీనిపై ఆక్వా రైతులు నిరసనలు చేస్తూ రోడ్డెక్కారన్నారు. మొక్కజొన్న రైతులు మొక్కజొన్నలను రోడ్డుపై పారబోసి ఆందోళన చేశారన్నారు. రైతులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలో రైతులకు అన్నిరకాల సేవలు అందుబాటులో ఉంచామన్నారు. గిట్టుబాటు ధర లభించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. ముందు తీసుకున్న భూములకే న్యాయం చేయలేదని, ఇప్పుడు మళ్లీ భూములు తీసుకుని వారికి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చి సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి వెంట మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్లు మాదాసి వెంకయ్య, వై.ఎం.ప్రసాద్‌రెడ్డి, పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, పాలడుగు శ్రీనివాసరావు, నటారు జనార్దనరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, రాయపాటి అంకయ్య, నారపరెడ్డి, మధు, దేవరపల్లి అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


