కలెక్టర్‌ మీ కోసంకు 186 వినతులు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ మీ కోసంకు 186 వినతులు

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

కలెక్టర్‌ మీ కోసంకు 186 వినతులు రెవెన్యూ సమస్యలపై చర్యలు తీసుకోవాలి పోలీసు మీ కోసంకు 49 ఫిర్యాదులు

ఒంగోలు సబర్బన్‌: స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి మొత్తం 186 వినతులు వచ్చాయి. కలెక్టర్‌ రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి, ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయజ్యోతి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ సూచించారు. ఏదైనా కారణంతో ఫిర్యాదు పరిష్కారం సాధ్యం కాకపోతే దానికి గల కారణాలను అర్జీదారునికి అర్థమయ్యే విధంగా ఎండార్స్‌మెంటు ఇవ్వాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ విజయసునీత

మార్కాపురం టౌన్‌: ప్రజల నుంచి సమస్యలపై అందిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయసునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మొత్తం 169 అర్జీలు వచ్చాయని, వాటిలో రెవెన్యూకు సంబంధించి 108, ఇతర సమస్యలపై 61 అర్జీలు వచ్చాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీఓలు ప్రభాకర్‌, శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఒంగోలు టౌన్‌: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 49 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీ హర్షవర్థన్‌రాజును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందజేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాఽధితులతో మాట్లాడి సమస్య పూర్వాపరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదులు చేయడానికి పోలీసు స్టేషన్‌కు వచ్చే వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయానికి రాలేని వ్యక్తులు స్థానికంగా పోలీసు స్టేషన్లోగానీ, సబ్‌ డివిజన్‌ కార్యాలయంలోగానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ వెంకటేశ్వరరావు, కొండపి సీఐ రవనయ్య, దర్శి సీఐ రామారావు, ప్యానల్‌ అడ్వకేట్‌ బాలాజీ సింగ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement