టీడీపీలో విగ్రహ చిచ్చు | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో విగ్రహ చిచ్చు

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి విగ్రహ ఏర్పాటుకు ఆయన వర్గీయుల చర్యలు ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన లిక్కర్‌ మాఫియా విగ్రహ ఏర్పాటును అంగీకరించేది లేదన్న మరో వర్గం అమ్మనబ్రోలు గ్రామ టీడీపీలో మరో మారు భగ్గుమన్న వర్గ విభేదాలు విగ్రహాన్ని అర్ధరాత్రి హడావిడిగా ఏర్పాటు చేసిన వీరయ్య వర్గీయులు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన మరో వర్గం నిత్యం పోలీసు పహారాలో అమ్మనబ్రోలు గ్రామం

నాగులుప్పలపాడు: అమ్మనబ్రోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోమారు రచ్చకెక్కాయి. గ్రామంలో టీడీపీలో చాలా ఏళ్ల నుంచి ఉప్పు, నిప్పుగా ఉన్న అంతర్గత పోరు గత ఏడాది ఏప్రిల్‌ 22న నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, అదే గ్రామానికి చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యతో తార స్థాయికి చేరింది. ఈ హత్యలో అమ్మనబ్రోలు గ్రామానికే చెందిన టీడీపీ నాయకులే ప్రధాన పాత్రధారులని, గ్రామ టీడీపీలో ఆధిపత్య పోరుకే హత్యలు జరిగాయని పోలీసులు తేల్చేశారు. అయితే వీరయ్య హత్య జరిగినప్పటి నుంచి గ్రామంలో నిత్యం పోలీసుల పహారా కొనసాగుతున్నా అక్కడక్కడా ఘర్షణలు తెలెత్తుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పోలీసులు అణగదొక్కుతూ వస్తున్నా వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా 4 రోజుల కిందట గ్రామంలోని కనపర్తి కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం పక్కనే వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటు చేయడానికి ఆయన అనుచరులు పూనుకున్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన వీరయ్య చౌదరి విగ్రహం ఏర్పాటును అనుమతించేది లేదని అడ్డుకోవడంతో పాటు హైకోర్టుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 22వ తేదీ రాత్రి వీరయ్య చౌదరి వర్ధంతి సందర్భంగా అర్ధరాత్రి సమయంలో విగ్రహం ఏర్పాటు చేయదలిస్తే పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘర్షణ వాతావరణంలో వీరయ్య చౌదరి వర్గంలోని ఓ వ్యక్తి ఒంగోలు రూరల్‌ సీఐ మీద దూకుడుగా ప్రవర్తించడంతో పాటు పోలీసులను తీవ్రంగా దూషించారు. ఈ అంశాన్ని సీరియర్‌గా తీసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి సుమారు 200 మంది వరకు నాగులుప్పలపాడు పోలీస్‌ స్టేషన్‌ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పోలీసుల ఆదేశాలను కూడా లెక్కచేయకుండా అనుమతి లేని ప్రదేశంలో విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు శాంతి భద్రతలకు వెళ్లిన తమపై దాడికి యత్నించడంతో ఎలాగైనా ఆ విగ్రహాన్ని కిందకు దించాలని పోలీసులు కూడా అంతే స్థాయిలో సిద్ధమయ్యారు. అయితే అర్ధరాత్రి 2 గంటల వరకు అదే ప్రయత్నంలో ఉన్న పోలీసులకు చివరి నిమిషంలో ఏం ఆదేశాలు వచ్చేయో తెలియదు కానీ ఒంగోలు నుంచి వచ్చిన 4 బెటాలియన్‌ పోలీసులు 3 గంటల తరువాత వెనుతిరిగి వెళ్లిపోయారు. అయినా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఎలాంటి పనులు చేపట్టకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో గ్రామంలో మరో మారు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఈ క్రమంలో వీరయ్య వర్ధంతిని అమ్మనబ్రోలు గ్రామంలో నిర్వహించిన ఆయన వర్గీయులు పరుష పదజాలంతో మాట్లాడటంతో పాటు విగ్రహ ఏర్పాటును ప్రతిపక్ష పార్టీలపై నెట్టేలా వీరయ్య అనుచరుడు మాట్లాడటంతో దీనికి వైఎస్సార్‌ సీపీ నాయకులు దీటుగా జవాబిచ్చింది. వీరయ్య చౌదరి హత్య జరిగినప్పుడు కూడా దాన్ని వైఎస్సార్‌ సీపీ మీదకు నెట్టేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నారు. తీరా పోలీసుల విచారణలో టీడీపీలోని వారే ఈ హత్య చేశారని తేలడంతో దాన్ని కప్పిపుచుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వీరయ్య విగ్రహ ఏర్పాటును మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీలోని మరో వర్గం బహిరంగంగా బయటపడి శనివారం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ఘాటుగానే స్పందించారు. పేదల పెన్నిధి, మద్యపానాన్ని పూర్తిగా వ్యతిరేకించిన మహా నాయకుడు ఎన్టీఆర్‌ పక్కన ఓ లిక్కర్‌ డాన్‌ విగ్రహం ఏర్పాటు చేయడం తాము ఏ మాత్రం అంగీకరించేది లేదని మీడియాకు తెలియజేయడంతో పాటు ఇప్పటికే విగ్రహం ఏర్పాటును అడ్డుకుంటూ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ ఘటనలతో గ్రామ టీడీపీతో పాటు మండల వ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పార్టీలో, గ్రామంలో ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం కేడర్‌లో నెలకొంది. గ్రామంలో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, జిల్లా టీడీపీ నాయకత్వం కానీ ఈ అంశాన్ని చూసీచూడనట్లు వదిలేసింది.

Advertisement
 
Advertisement
Advertisement