లబ్ధిదారుల సంఖ్య కుదిస్తే ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

లబ్ధిదారుల సంఖ్య కుదిస్తే ఉద్యమం

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

ఒంగోలు టౌన్‌: గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను యథాతథంగా ఇవ్వాలని, లబ్ధిదారుల సంఖ్య కుదిస్తే ఉద్యమం తప్పదని సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు హెచ్చరించారు. స్థానిక సుందరయ్య భవనంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికలకు ముందు అగ్రహారం, వెంగముక్కలపాలెం ప్రాంతాల్లో 280 ఎకరాలను కొనుగోలు చేసి ఒక్కో లబ్ధిదారునికి సెంటు స్థలం చొప్పున రిజిస్ట్రేషన్‌ చేశారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్‌ ఎంక్వయిరీ పేరుతో 13 వేల మందిని తొలగించడం అన్యాయమన్నారు. ఒకే ఇంటిలో రెండు మూడు కుటుంబాలు ఉంటున్నా కరెంటు మీటర్ల ఆధారంగా అనర్హులుగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తే ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ భూముల్లో 20 నుంచి 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న దారావారికుంట, దత్తాత్రేయకాలనీ, మదర్‌థెరిసా కాలనీ, న్యూ అంబేద్కర్‌ నగర్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ కాలనీ, మోటూరు ఉదయం కాలనీల పేదలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. అమృత్‌ పథకం కింద ప్రతిరోజూ నీరందిస్తామని చెబుతున్నా మూడు రోజులకోసారి నీరివ్వడం గగనమవుతుందన్నారు. పోతురాజు కాలువ అభివృద్ధి ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 7 నుంచి 11 వరకు ప్రజా పోరుబాట నిర్వహించి 13వ తేదిన కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. తొలుత పోరుబాట వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసులు, వీరాస్వామి, ఎస్‌డీ హుసేన్‌, దామా శ్రీనివాసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement