పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం | - | Sakshi
Sakshi News home page

పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సోమవారం పిడుగులు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపించగా..సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తరువాత ఉరుములు మెరుపులతో పిడుగులు పెద్ద సంఖ్యలో పడ్డాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. ముఖ్యంగా పొలం పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో పిడుగులు పడటంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడ్డారు.

త్రిపురాంతకం: పిడుగులు, ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలు పూర్తిస్థాయిలో దెబ్బతినగా, పిడుగుపాటుకు ఓ ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన త్రిపురాంతకం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో లింగాల కోటేశ్వరరావుకు చెందిన 1.50 లక్షల విలువ చేసే ఎద్దు మృతి చెందగా, అదే సమీపంలో మరో ఎద్దు తప్పించుకుని పరిగెడుతూ ఓ మహిళలను ఢీకొట్టడంతో ఆమె గాయపడింది. గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి రైతులు బెంబేలెత్తారు. ఒక్క సారిగా వాతావరణంలో మార్పులు చేసుకుని భారీ వర్షం కురవటంతో కళ్లాల్లోని మిరిప కాయలు పూర్తిగా తడిచిపోయాయని రైతులు వాపోయారు. వాటికి పట్టాలు కప్పే పరిస్థితి కూడా లేకపోవటంతో భారీగా పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. దీంతో పాటు అరటి, బొప్పాయి, మెక్కజొన్న పంటలకు సైతం నష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.

పొన్నలూరు: పొన్నలూరులో పిడుగు పడి వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని బాప్టిస్ట్‌ నగర్‌కు చెందిన చుండి సామ్యేలు గ్రామానికి సమీపంలో ఉన్న పొలం దగ్గరకు వెళ్లాడు. ఇంటికి వచ్చే క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడటంతో మార్గ మధ్యలో చెట్టు కిందకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములతో చెట్టుకు సమీపంలో పిడుగు పడటంతో వీపు భాగం, కాళ్లకు స్వల్ప గాయాలతో సృహతప్పి పడిపోయాడు. దీంతో అటుగా వస్తున్న వారు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చికిత్స నిమిత్తం స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలు తరలించారు.

పొదిలి రూరల్‌: మండలంలోని ఓబులక్కపల్లిలో సోమవారం పిడుగుపడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన తిరుమలశెట్టి భాగ్యలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పొలంలో పిడుగుపడిన సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మి శరీరంలోని వెనుక వైపు, చేయి తీవ్రగాయాలతో ఆపస్మారక స్థితిలో జారుకుంది. స్థానికులు గ్రామస్తులు తెలపడంతో వెంటనే పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు.

పొదిలి: పొదిలి పట్టణంలో ఉరుములు మెరుపులతో సోమవారం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో స్థానిక శ్రావణి ఎస్టేట్‌లోని చెరుకూరి నాగవర్థనమ్మ భవనంపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు భవనం ఎలివేషన్‌ పాక్షికంగా దెబ్బతినటంతో పాటు, అద్దాలు పగిలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నందిపాలెం గ్రామంలోని పొలాల్లో విపరీతంగా వీచిన గాలికి కరెంటు స్తంభం దెబ్బతింది. విరిగిపోయిన పోల్‌ కొంత భాగం తీగలకు వేలాడుతుంది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

మర్రిపూడి: మండలంలోని వేమవరం, కూచిపూడి, మర్రిపూడి, గుండ్లసముద్రం, అంకేపల్లి గ్రామాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షానికి వేమవరంలో పొగాకు, టమోటా పంటలు దెబ్బతిన్నాయి. గుండ్లసముద్రం దళితవాడలో ఇళ్లల్లోకి వర్షం నీరు చేరింది. వల్లాయపాలెం, మర్రిపూడి, గంగపాలెం గ్రామాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో రేకులు ఇళ్లు దెబ్బతిన్నాయి. వడగండ్ల వర్షానికి పంట నష్టం సంభవించింది. పంట పొలాల్లో వర్షం నీరు నిలిచాయి.

పొదిలి మండలం ఓబులక్కపల్లిలో పిడుగుపాటుకు

గాయపడిన భాగ్యలక్ష్మి

త్రిపురాంతకం కల్లాల్లో తడిసిన మిరపకాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement