పెద్దదోర్నాల: మండల పరిధిలోని హసానాభాద, జమ్మిదోర్నాల గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన టోల్ ప్లాజా ఆయా గ్రామాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదం రెండు గ్రామాల ప్రజలు ఎదురు పడటంతో తోపులాటకు దారి తీసింది. రెండు గ్రామాల నడుమ నిర్మించిన టోల్‌ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటే, కాదు తమ ఊరి పేరే పెట్టాలంటూ హసానాబాద, జమ్మిదోర్నాలకు చెందిన గ్రామస్తులు ఏకంగా సోమవారం రోడ్లపైకి చేరి ఆందోళన చేయటంతో ఏకంగా రెండు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో టోల్‌ప్లాజాకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో మండుతున్న ఎండలకు పలు వాహనాల్లోని ప్రయాణికులతో పాటు చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..ఆయా రెండు గ్రామాల నడుమ ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాకు జమ్మిదోర్నాల పేరు పెట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే టోల్ ప్లాజా ఏర్పాటుకు తమ గ్రామంలోని రైతులకు చెందిన స్థలాలనే వినియోగించారని, కోట్ల రూపాయల విలువ చేసే స్థలాలను టోల్ ప్లాజా నిర్మాణాలకు తాము కారు చౌకగా ప్రభుత్వానికి ఇచ్చామని కాబట్టి టోల్‌ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని హసానాబాదకు చెందిన పలువురు రైతులు వాదిస్తున్నారు. అయితే టోల్‌ప్లాజాకు తమ ఊరి పేరు పెట్టాలంటూ ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసిందని, అందువల్ల తమ ఊరి పేరే పెట్టాలని జమ్మిదోర్నాలకు చెందిన పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం టోల్ ప్లాజాకు నేమ్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంలో రెండు గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కొందరు ఆకతాయిలు ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లను విసురుకోవడంతో గందరగోళం వాతావరణం నెలకొంది. దీంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, పురుగు మందు డబ్బాలతో హల్‌చల్ చేశారు. సంఘటనా స్థలిలో కొద్ది మంది మాత్రమే పోలీసులు ఉన్నా, అక్కడ భారీగా గుమిగూడిన గ్రామస్తులను అదుపులోకి తీసుకురావడం అసాధ్యమైంది. దీంతో సమాచారమందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్‌కుమార్ సంఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం సీఐ అజయ్‌కుమార్, నేషనల్ హైవే కాంట్రాక్టర్ రవీంద్రారెడ్డితో ప్రత్యేకంగా చర్చించారు. టోల్‌ప్లాజాకు సంబంధించిన వివాదాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
రెండు గ్రామాలకు చెందిన వారి మధ్య తోపులాట
టోల్‌ప్లాజాకు తమ ఊరి పేరే పెట్టాలని ఇరు గ్రామాలు పట్టు
గ్రామస్తులు రోడ్లపై భైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జాం
రెండు గంటల పాటు ఎండ తీవ్రతకు అల్లాడిన చిన్నారులు, వృద్ధులు


