పోలీసు స్పందనకు 80 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీసు స్పందనకు 80 ఫిర్యాదులు

Apr 7 2026 8:13 AM | Updated on Apr 7 2026 8:13 AM

పోలీసు స్పందనకు 80 ఫిర్యాదులు బూచేపల్లి ఫ్లెక్సీని చింపేసిన టీడీపీ దుండగులు ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

ఒంగోలు టౌన్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు 80 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు నేరుగా ఎస్పీ హర్షవర్థన్‌ రాజును కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడిన ఎస్పీ వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసుస్టేషన్‌ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వృద్ధులు, నడవలేని వారి సమస్యలను విని వారికి సత్వర న్యాయం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహిళా పోలీసుస్టేషన్‌ డీఎస్పీ రమణకుమార్‌, చీమకుర్తి సీఐ ప్రసాద్‌, అద్దంకి సీఐ సుబ్బరాజు, ప్యానెల్‌ అడ్వకేట్‌ బాలాజీ సింగ్‌, మీ కోసం ఎస్సై జనార్దన్‌రావు పాల్గొన్నారు.

ముండ్లమూరు: వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని టీడీపీ దుండగులు చింపేశారు. ఈ ఘటన మండలంలోని నూజెల్లపల్లిలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన హనుమంతరావు అనే కార్యకర్త తన ఇంటి వద్ద ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా బూచేపల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అది ఓర్చుకోలేని టీడీపీ వర్గీయులు ఫ్లెక్సీని చించివేశారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్త అయిన హనుమంతరావుపై వారం రోజుల క్రితం దాడి చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇస్తే కేసు తీసుకోకుండా కాళ్లరిగేలా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చింత శ్రీనివాస్‌రెడ్డి అక్కడకి చేరుకొని టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై దాడిచేసి, ఫ్లెక్సీలు చింపి వేయడంపై మండిపడ్డారు. ఫ్లెక్సీ చించివేతపై గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ తాతపూడి రత్నరాజు, మండల నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

కురిచేడు: మండలంలోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు జీబీబీ రఘువీరను జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సస్పెండ్‌ చేశారు. పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఎంఈఓ సీహెచ్‌ కోటయ్య విచారించారు. విచారణలో సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తించినట్లు ధ్రువీకరించడంతో అతన్ని సస్పెండ్‌ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement