రాచర్ల: నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం నీటి గుండంలో జరిగే తెప్పోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను మార్కాపురం కలెక్టర్ ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు శుక్రవారం పరిశీలించారు. తొలుత నెమలిగుండ్ల రంగనాయకస్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం 10 గంటలకు జరిగే తెప్పోత్సవాన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించాలని అధికారులకు సూచించారు. నీటి గుండం వద్ద గజ ఈతగాళ్లను ఉంచాలని ఆదేశించారు. భక్తులు నీటి గుండంలో స్నానాలకు వెళ్లకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీవో ప్రభాకర్, గిద్దలూరు, రాచర్ల తహసీల్దార్లు అంజనేయరెడ్డి, ఎల్.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎస్.వెంకటరామిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య పాల్గొన్నారు.


