గ్రూప్‌–డి శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–డి శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

గ్రూప్‌–డి శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల జైలు గంజాయి కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు చోరీ కేసులో దొంగ అరెస్టు వైఎస్సార్‌ సీపీ నుంచి ముగ్గురు సస్పెన్షన్‌

మార్కాపురం రూరల్‌: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రూప్‌–డి శిక్షణకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు తేదీని పొడిగించిందని ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకులు ఎస్‌.నిర్మలా జ్యోతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు 60 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని, స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 99892 85530, 89850 90926ను సంప్రదించాలని సూచించారు.

ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పు వెల్లడించారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం మేరకు.. వెలిగండ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బద్దిపూడి అనోక్‌ 2022 జూలై 24న తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాలిక తల్లికి తెలియడంతో వెలిగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై పి.విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేయగా ఒంగోలు దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ ఎ.పల్లపురాజు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. పోలీసులు సాక్షులను సకాలంలో హాజరుపరచడంతో కేసు విచారణ అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు న్యాయమూర్తి పేర్కొంటూ పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.75 వేలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడేవారు చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ కేసు రుజువు చేస్తోందని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజన్లు ఈవీ స్వామి, యల్లమంద, కె.సాయి హరికృష్ణారెడ్డిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఒంగోలు: ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి గంజాయి స్వాధీనం కేసులో మొదటి నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి మంగళవారం తీర్పు వెల్లడించారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పి.పద్మజ కథనం ప్రకారం.. 2017 నవంబర్‌ 30న చీమకుర్తి ఏకలవ్యనగర్‌లోని పాలపర్తి వెంకట్రావు నివాసంలో చీమకుర్తి ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ వి.శ్రీనివాసులు పలువురు అధికారులు, మధ్యవర్తుల సమక్షంలో ఆకస్మిక తనిఖీ చేశారు. 3.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని, పాలపర్తి వెంకట్రావు, బొర్రా సింహాచలం(విశాఖ)పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసు విచారణ సమయంలో రెండో నిందితుడు మరణించగా, మొదటి నిందితునిపై విచారణ పూర్తి చేశారు. నిందితునిపై నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ ఐదేళ్ల జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

రూ.9.25 లక్షల సొత్తు రికవరీ

కొండపి: చోరీ కేసులో నిందితుడిని అరెస్టు చేసి, 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లుకందుకూరు డీఎస్పీ బాలసుబ్రమణ్యం తెలిపారు. మంగళవారం స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కొండపి మండలం జాళ్లపాలెం గ్రామానికి చెందిన ముదిరెడ్డి రామలక్ష్మమ్మ మార్చి 7వ తేదీన ఇంటికి తాళం వేసి పనిపై బయటకు వెళ్లింది. ఉదయం 11:30 గంటలకు ఇంటికి చేరుకోగా తలుపులు తెరిచి ఉన్నాయి. రెండు బంగారు గొలుసులు, ఒక నల్లపూసల దండ, రెండు జతల చెవిపోగులు, రెండు పాపట బిల్లలు చోరీ అయ్యాయని బాధితురాలు ఫిర్యాదు చేయగా కొండపి సీఐ సోమశేఖర్‌, ఎస్సై ప్రేమ్‌కుమార్‌ దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత సాయంతో పొదిలి మండలం ఏలూరు గ్రామానికి చెందిన చిన్నపురెడ్డి వినయ్‌కుమార్‌రెడ్డి(21)ని నిందితుడిగా గుర్తించారు. మంగళవారం ఉదయం కొడపి–జాళ్లపాలెం మార్గంలో ఒకటో కిలోమీటర్‌ రాయి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిండితుడి నుంచి రూ.9.25 లక్షల విలువైన 78 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబరిచిన కొండపి సీఐ, ఎస్సైతోపాటు సిబ్బంది సుధాకర్‌, రవి, అనిల్‌, అంజయ్యను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు.

కనిగిరి రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ పెరుగు మురళీకృష్ణ(మాజీ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌), పెరుగు తిరుపతమ్మ(వెదుళ్లచెరువు సర్పంచ్‌, వెలిగండ్ల మండలం), సంగు సుబ్బారెడ్డి(కనిగిరి రూరల్‌ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు)ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సు మేరకు పార్టీ అధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement