ఒంగోలు సిటీ: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తనకు తాను మంచి ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటోందని, రెండేళ్లుగా అన్ని రకాలుగా విఫలం చెంది అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్యాత 5.40 లక్షల పెన్షన్లు తొలగించారని, మరో ఏడున్నర లక్షల పెన్షన్లను తొలగించేందుకు బడ్జెట్‌లో కోత విధించారని ఆరోపించారు. జగనన్న ప్రభుత్వ హయాంలో సెకీ ఒప్పందంలో 2.49 పైసలకు విద్యుత్ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారని గుర్తు చేశారు. ఈ ఒప్పందంలో జగనన్న అవినీతికి పాల్పడినట్లు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒక వేళ అవినీతి జరిగి ఉంటే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుందని, రేపు మళ్లీ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేయకుండా ఉండేందుకు 25 ఏళ్ల పాటు సీలింగ్ విధించారని మండిపడ్డారు. ఇండోసోల్ కంపెనీకి జగనన్న హయాంలో 4 వేల ఎకరాలు కేటాయించారని, అప్పుడు ఆ కేటాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 8 వేల ఎకరాలు కేటాయించడంలో పరమార్థం ఏమిటని ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే కింద రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, దేశం మొత్తం కిలోమీటరుకు రూ.20 నుంచి 21 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కిలోమీటరుకు రూ.81 కోట్లు ఖర్చు చేయడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చుండూరి పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో?
చంద్రబాబు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదని చుండూరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీట్లను పెంచుకునేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తోందని ఆరోపించారు. సుధీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు కనీసం ఒక్క పోర్టును నిర్మించిన పాపాన పోలేదన్నారు. జగనన్న ఐదేళ్ల పాలనలో నాలుగు పోర్టులు నిర్మించి రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వేయి కిలోమీటర్ల తీరం ఉందని, సన్‌రైజ్ స్టేట్‌గా పేరుపెట్టి డబ్బాలు కొట్టుకోవడానికే సరిపోయిందని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఒక తరానికి కూడా నేరవేరడం లేదన్నారు. రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మరేమీ కనిపించడం లేదన్నారు.
ముస్లింలను ప్రశాంతంగా బతకనివ్వరా?
ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలు ప్రశాంతంగా బతకనీయకుండా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేధింపులకు పాల్పడుతున్నారని చుండూరి ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలకు కష్టాలు వచ్చిపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కొత్తపట్నం బ్రిడ్జి వద్ద ఉన్న ముస్లిం శ్మశానవాటిక స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని గమనించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దశరాజుపల్లి వద్ద రెండు ఎకరాల స్థలం ఇచ్చి కౌన్సిల్‌లో తీర్మానం కూడా చేసిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరికి లబ్ధి చేకూర్చేందుకు ముస్లిం ఖబరస్థాన్ స్థలాన్ని రద్దు చేసి దొంగదెబ్బ తీశారని విమర్శించారు. ఒకవైపు ముస్లిం సమాజం ఖబరస్థాన్ స్థలం రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా లెక్క చేయకుండా కౌన్సిల్లో పెట్టి రద్దు చేయడం దుర్మార్గమన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో నిర్మాణం పూర్తి చేసుకున్న షాదీఖానాను ఎందుకూ పనికిరాకుండా మూలనపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలన వచ్చిన తర్వాత నగరంలోని ఉర్దూ స్కూల్‌ను పడగొట్టడం ముస్లిం సమాజాన్ని తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ముస్లింలపై జరుగుతున్న వరస దాడులతో భయాందోళన నెలకొందని చెప్పారు. నగరంలోని మినీ స్టేడియం వద్ద ఉన్న గౌస్ హోటల్లో సామాన్లను బయట పడేయడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ నెల 26వ తేదీన అర్ధరాత్రి నగరంలో పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన దాడిని ముస్లిం సమాజం ఆత్మగౌరవం మీద కొట్టిన దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. రాయల్ యాడ్ ఏజెన్సీని ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ను బలవంతంగా పడగొట్టడం ద్వారా ముస్లింలు వ్యాపారాలు చేసుకునేందుకు వీల్లేదని హెచ్చరించినట్లు ఉందన్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలో భాగంగా రాయల్ యాడ్ ఏజన్సీస్ ఏర్పాటు చేసిన హోర్డింగులను పడగొట్టారని స్పష్టం చేశారు. ఇప్పటికై నా ముస్లింలపై దాడులు ఆపకుంటే శాంతియుతంగా నిరసనకు దిగుతామని చుండూరి హెచ్చరించారు. సమావేశంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహ గౌడ్, వైఎస్సార్ సీపీ నాయకులు దాసరి కరుణాకర్, చిన్నా, రోండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పిగిలి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, మల్లిశెట్టి దేవా పాల్గొన్నారు.
పింఛన్లు తొలగించేందుకు
బడ్జెట్‌లో కోత విధించిన సర్కార్
ఒక్క పోర్టును కూడా చంద్రబాబు నిర్మించిన పాపాన పోలేదు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందే
నిరుపేదలను వేధిస్తున్న
కూటమి శాసనసభ్యులు
వైఎస్సార్ సీపీ ఒంగోలు ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ధ్వజం
టీటీడీ చైర్మన్‌ది సిగ్గుమాలిన చర్య
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ బీఆర్ నాయుడు నిర్వాకం సిగ్గు చేటని, ఆయనతో రాజీనామా చేయించాలని చుండూరి రవిబాబు డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికారం శాశ్వతమని భావిస్తూ రాష్ట్రంలోని నిరుపేద ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూములు కబ్జా చేస్తూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై పోలీసులకు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యేల కొమ్ము కాస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు.


