అన్ని కోణాల్లో దర్యాప్తు..
డీఎన్‌ఏ రిపోర్టులు రావడంతో మృతదేహాలు అప్పగింత అంబులెన్స్‌ల్లో స్వగ్రామాలకు తరలింపు మార్కాపురం జీజీహెచ్‌లో మిన్నంటిన మృతుల బంధువుల రోదనలు అన్ని కోణాల్లో దర్యాప్తు: డీఎస్పీ నాగరాజు
క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్
బోరున విలపిస్తున్న మృతుడు అనిల్ సోదరి, బంధువులు
ఘోర బస్సు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారు, ఆత్మీయులను పోగొట్టుకున్న కుటుంబాల వారు తమ వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు వచ్చారు. చనిపోయిన వారి ముఖాలు కనిపించక, మృతదేహాలను చూడలేక ‘ఇదేం ఘోరం’ అని రోదించారు. చివరిచూపు చూసే అవకాశం లేకుండా పోయిందని గుండెలు పగిలేలా విలపించారు. మార్కాపురం జీజీహెచ్ మార్చురీ వద్ద మృతుల కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
మార్కాపురం టౌన్:
మార్కాపురం మండలంలోని రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనమైన 14 మందికి చెందిన మృతదేహాలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తుపట్టలేని విధంగా మారిన మృతదేహాలను మార్కాపురం జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి డీఎన్‌ఏ రిపోర్టులు వచ్చాయి. మృతుల బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. డీఎన్‌ఏ రిపోర్టుల ఆధారంగా బాడీలను ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ప్రమాదంలో 14 మంది సజీవదహనం అయ్యారు. అందులో జిల్లాకు చెందిన వారు పది మంది ఉండగా, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. జిల్లా కొనకనమిట్ల, పొదిలి, కనిగిరి, వలేటివారిపాలెం, నెల్లూరు జిల్లా నుంచి కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుంచి మృతుల కుటుంబ సభ్యులు వచ్చారు. బంధువుల రోదనలతో జీజీహెచ్ ప్రాంగణం మార్మోగింది. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారు వివిధ కారణాలతో సొంత గ్రామాలకు బయలు దేరారు. కొద్ది గంటల్లో వారు వస్తున్నారని ఆశగా ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బస్సు ప్రమాదం తీరని శోకాన్ని నింపింది. ఎన్నో ఆశలతో పండుగకు వెళుతున్నాం అనుకుంటున్న కొందరు, తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని భావించి వస్తున్న మరి కొందరిని బస్సు ప్రమాదం విగత జీవులుగా మార్చిందని మృతుల బంధువులు విలపించారు. గుండె నిండిన భారంతో చివరి చూపు చూసుకోవాల్సిన రక్త సంబంధీకులను కాలిబూడిదైన మృతదేహాల రూపంలో ఎలాచూడాలో అర్థంకాక కంటతడి పెట్టుకున్నారు. అంబులెన్స్‌లో మృతదేహాలను బరువెక్కిన హృదయాలతో స్వస్థలాలకు తీసుకెళ్లారు.
చివరి చూపు కరువై..
గుండె బరువై..
బస్సు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంతో చెలరేగిన మంటలను ఆదుపుచేయటంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, వైద్యశాఖ, మున్సిపల్‌శాఖతో అన్ని శాఖల అధికారుల సమన్వయం పనిచేశాయని, 28 మందిని కాపాడామని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రమాదం అనంతరం క్షతగాత్రులను జీజీహెచ్‌కు తరలించటం, అక్కడ వారికి మెరుగైన వైద్యం సేవలను ఆరోగ్యశాఖ సిబ్బంది అందించారన్నారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి కారకులైన డ్రైవర్‌లకు చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని తెలిపారు. జీజీహెచ్ వద్ద వివిధ శాఖలకు చెందిన అధికారులు మృతుల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు.
మార్కాపురం: మార్కాపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలెక్టర్ ఎం.విజయసునీత శనివారం పరామర్శించారు. ప్రమాద బాధితులకు అందుతున్న వైద్యసేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండి పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్లాలని వారికి భరోసా కల్పించారు. చిన్న గాయాలతో కోలుకుని ఇంటికి వెళ్లిన వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జేసీ శ్రీనివాసులు, డీఎంహెచ్‌వో వాణీశ్రీ, జిల్లా మలేరియా అధికారి రాహుల్, వైద్యశాలలోని వైద్యులు, అధికారులు ఉన్నారు.


