● ఆశ్రమం వెళ్లే దారిలో తిరిగినట్లు రైతుల సమాచారం
పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని శ్రీశైలం రహదారిలోని ఆశ్రమం వెళ్లే దారిలో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం ఆశ్రమానికి వెళ్లే దారిలో చిరుతపులి సంచరించినట్లు కొందరు రైతులు తెలపటంతో అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా చిరుతపులి అడుగులు, గుర్తులు కనబడకపోవటంతో అధికారులు ఆశ్రమం దారిలో ట్రాప్డ్ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. చిరుతపులి సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని వివరణ కోరగా చిరుతపులి సంచారంపై ఎటువంటి ఆధారాలు లభించలేదని, శుక్రవారం డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. దీంతో పాటు ట్రాప్డ్ కెమెరాలను ఏర్పాటు చేసి శనివారం సైతం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఒంగోలు టౌన్: గిద్దలూరు సమీపంలోని నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఉత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 2, 3, 4, 5 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఒంగోలు నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఘట్టమనేని శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మార్కాపురం: నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో జరిగే సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డీకేఎం రఫీ కోరారు. సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పీ ఆవులయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందన్నారు. కార్మికుల హక్కులు, సంక్షేమంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మాలకొండయ్య, సుబ్బరాయుడు, పీరావలి, వెంకటేశ్వరరెడ్డి, రూతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: రాష్ట్రంలో వరసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలను నివారించడంలో రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకుడు షేక్ సత్తార్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఒక రెండు రోజులు హడావుడి చేయడం తప్పితే దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే చర్యలు శూన్యమన్నారు. ప్రైవేటు బస్సుల నిర్వాహకుల అక్రమాలను కట్టడి చేయకుండా అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రాలలో రిజిస్టర్ చేయించుకోవడం, ఒకే నంబర్ మీద అనేక వాహనాలను నడపడం వంటి వాటిని రవాణా శాఖ అధికారులు తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదని, నెలవారి మామూళ్లకు అలవాటు పడిపోయిన అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల మితిమీరిన వేగం ప్రయాణికుల ప్రాణాలను బలిగొంటుందని, లారీ డ్రైవర్లను తక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారని, ప్రయాణికుల కోసం నగరంలోనే గంటల తరబడి తిరగాల్సి రావడం డ్రైవర్ల మీద ఒత్తిడి పెంచుతుందన్నారు. రాజకీయ నాయకుల జోక్యంతో ట్రావెల్ బస్సులపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఒక ప్రమాదం జరిగినప్పుడు దాని నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం దారుణమన్నారు. మార్కాపురం ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


