14 మందిని బలిగొన్న బస్సు ప్రమాదానికి కారణమెవరన్న దానిపై చర్చ మూడు నెలల క్రితమే రూ.30 వేలు ఫైన్ వేసి వదిలేసిన రవాణా శాఖ అధికారులు హరికృష్ణ ట్రావెల్స్‌కు ఇచ్చిన రూట్ పర్మిషన్ ఏది వినుకొండ మీద నుంచి వెళ్లాల్సిన బస్సు యర్రగొండపాలెం వైపు ఎందుకు మళ్లింది మైనింగ్ నిబంధనలను అతిక్రమించిన టిప్పర్ ట్రావెల్ బస్సులో గ్యాస్ సిలిండర్ ?
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీతారాముల కల్యాణోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఒంగోలులోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణోత్సవంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద పురోహితుడు మఠంపల్లి దక్షిణామూర్తి కల్యాణోత్సవం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీతారాముల వివాహం కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, ధర్మం, న్యాయం, ప్రేమ, కర్తవ్య నిర్వహణ వంటి ఉన్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రతి రోజూ 100కు పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఒంగోలు మీద నుంచి మరో 150 బస్సులు వెళ్తున్నట్టు అంచనా. మొత్తం మీద 250 బస్సులు ప్రతి రోజూ బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, తిరుపతికి నడుస్తున్నాయి. మార్కాపురం, ప్రకాశం జిల్లాలే కాకుండా పల్నాడు జిల్లా వినుకొండ, నరసరావుపేటకు చెందిన అనేక మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండడంతోప్రైవేటు బస్సులకు గిరాకీగా మారింది.
భీతావహంగా ఉన్న ఘటనా స్థలం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మందిని బలిగొన్న బస్సు ప్రమాదానికి కారణమెవరన్న అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే రవాణా శాఖ అధికారుల అవినీతి, మైనింగ్, పోలీసు అధికారుల నిర్లక్ష్యం స్పష్టం కనిపిస్తోంది. కారణమెవరైనప్పటికీ పొట్టచేత పట్టుకొని వలస వెళ్లిన బడుగులు బలయ్యారు. వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోయాయి. కుటుంబాన్ని పోషించే దిక్కులేక కొందరి జీవితాలు రోడ్డున పడ్డాయన్నది మాత్రం సత్యం.
సమాధానాలు లేని సందేహాలు...
హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఫిట్నెస్ సరిగా లేదని మూడు నెలల క్రితమే రవాణా శాఖ అధికారులు రూ.30 వేల జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జరిమానా విధించిన అధికారులు బస్సును రోడ్డుపై నడిచేందుకు ఎందుకు సమ్మతించారో తెలియడంలేదు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో బయలుదేరిన బస్సులో ఎక్కువగా కనిగిరి, పామూరు, సీఎస్‌పురం, ఉదయగిరి ప్రాంతాలకు చెందిన వలస కూలీలు ఎక్కారు. నిజానికి ఈ బస్సు జగిత్యాల నుంచి కోరుట్ల, శిరికొండ, మేడ్చల్, హైదరాబాద్, మాచర్ల, వినుకొండ, పొదిలి మీదుగా వెళ్లాల్సి ఉంది. రిజర్వేషన్ షీట్‌లో కూడా ఇదే రూట్ ఉంది. కానీ మాచర్ల వచ్చిన తరువాత బస్సును యర్రగొండపాలెం వైపు ఎందుకు దారి మళ్లించాడన్న ప్రశ్నకు జవాబు చెప్పేవారే లేరు. తెల్లవారుజామున 4.30 సమయంలో బస్సు యర్రగొండపాలెం చేరుకున్నట్లు తెలుస్తోంది. అప్పటికే బస్సు స్టీరింగ్ బేరింగ్ సరిగ్గా పనిచేయడంలేదని, దాంతో సుమారు గంట సేపు యర్రగొండపాలెంలో బస్సు నిలిపినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఆ సమయంలో మెకానిక్‌లు ఎవరూ లేకపోవడంతో డ్రైవర్‌తో కలిసి బస్సు యజమాని హరికృష్ణారెడ్డి స్వయంగా మరమ్మతు చేసినట్లు సమాచారం. అంతక ముందు కూడా రెండు మూడు సార్లు బస్సు ఆగిపోయిందని ప్రాణాలు దక్కించుకున్న క్షతగాత్రులు చెబుతున్నారు. ఎందుకు బస్సు ఆగిపోతుందని అడగ్గా బ్యాటరీ సమస్య ఉందని,వేరే వాళ్లకి చెప్పాము తీసుకువస్తున్నారని చెప్పి బస్సును స్టార్ట్ చేశాడని అంటున్నారు. మరమ్మతులు అయిన తర్వాత వెళితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని, తమ వారిని కోల్పోయే వారం కాదని విలపిస్తున్నారు. ఇదిలా ఉండగా డ్రైవర్ యువరాజు ఉన్నప్పటికీ ప్రమాద సమయంలో బస్సు ఓనర్ హరికృష్ణ బస్సు నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనల ప్రకారం అనుమతించిన రూట్‌లో ప్రయాణం చేయకుండా తన ఇష్టమొచ్చిన రూట్లో బస్సును ఎందుకు తీసుకొచ్చాడో తెలియాల్సి ఉంది. ఇదంతా రవాణా శాఖ అధికారుల వైఫల్యమన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న రవాణా శాఖ అధికారులు బస్సుల రూట్లను కూడా పర్యవేక్షించడంలేదన్న సత్యం బయటపడింది.
మైనింగ్ అధికారుల నిర్లక్ష్యం...
మార్కాపురం పలకల గనుల సమీపంలో కొండలమీద మూల మలుపు వద్ద కంకరలోడుతో వచ్చిన టిప్పర్ రావడం వల్లనే ఘోర ప్రమాదం జరిగిందన్నది నిజం. ఒకవేళ ఆ సమయంలో టిప్పర్ కనుక రాకపోయి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో. 14 మంది ప్రాణాలు కాలి బూడిదయ్యేవి కావేమో. ఆ సమయంలో అటుగా కంకరలోడుతో టిప్పర్ రావడంపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సందేహం వ్యక్తం చేశారు. నిబంధనలను గాలికి వదిలేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆయన స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి బంధువుదని ప్రచారం జరుగుతోంది.
ప్రమాదకర మలుపు వద్ద సూచికలు ఏవీ..
మార్కాపురం హైవేపై పోలీసులు గస్తీ ఉన్నా బస్సు వేగాన్ని బట్టి నిలబెట్టే అవకాశం ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయవరం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులున్నా బస్సును ఆపిఉండే వీలుండేదేమో. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్లను గుర్తించడం, మూలమలుపుల వద్ద జాగ్రత్తలు సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయడం వంటివి పోలీసులు చేయాల్సి ఉంది. రాయవరం కొండపై ఉన్న మూలమలుపు వద్ద సూచికలు ఏర్పాటు చేసినట్లు కనిపించడంలేదు. దీంతో ఈ పాపంలో పోలీసులకు కూడా వాటా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
బస్సులో గ్యాస్ సిలిండర్ ?
బస్సు ప్రమాదం సంభవించినప్పుడు క్షణాల్లోనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం తెలిసిందే. కళ్లు మూసి తెరిచేలోపే బస్సు అగ్నికి ఆహుతవడం, బస్సులోని 14 ప్రయాణికులు కాలిబూడిదవడం జరిగిపోయింది. అయితే ఇంత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్సులో 5 కిలోల ఫుల్ గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఈ సిలిండర్ పేలడం వల్లనే మంటలు రేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో పోలీసు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
నిర్లక్ష్యం..
యమపాశమైంది!
– ఒంగోలు టౌన్


