ఒంగోలు టౌన్: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సీపీఎం నాయకుల బృందం శుక్రవారం పరామర్శించింది. బాధితులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యసేవల గురించి ఆరా తీశారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ ఉపాధి కోసం వలస వెళుతున్న బాధితులు తరచుగా జరుగుతున్న బస్సు ప్రమాదాల్లో మృతి చెందడం, తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం కావడం బాధాకరమన్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా నామ మాత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. చట్టాలను కఠినంగా అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, రాజకీయ ప్రయోజనాలనాశించిన పాలకులు ప్రైవేటు ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం చాలా తక్కువగా ఉందని, మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రమాదం సాధారణ ఘటన కాదని, వ్యవస్థ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేటు ట్రావెల్స్ అక్రమాల వలన జరిగిన మానవ విపత్తని చెప్పారు. ఫిట్‌నెస్ వాహనాలను నడపడం, టూరిస్ట్ పర్మిట్ పేరుతో స్టేజ్ క్యారేజీలుగా నడపడం, తనిఖీలు కాగితాలకు పరిమితం కావడం ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీజీహెచ్‌ను సందర్శించిన వారిలో కంకణాల రమాదేవి, చీకటి శ్రీనివాసరావు, ఎం.రమేష్, కాలం సుబ్బారావు, రఘురాం, జి.శ్రీనివాసులు ఉన్నారు.
జీజీహెచ్‌లో చికిత్స
పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న సీపీఎం
నాయకులు
ఒంగోలు జీజీహెచ్‌లో బాధితులను
పరామర్శించిన సీపీఎం బృందం


