లింగసముద్రం: అల్లుడు కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో పొగాకు బ్యారన్ దగ్ధమైంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మారెడ్డిపాలెంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..కశిరెడ్డి వెంకటేశ్వర్లుకు చెందిన బ్యారన్ క్యూరింగ్‌లో ఉండగా ప్రమాదవశాత్తు గొట్టాలపై పొగాకు కర్ర పడడంతో మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న రైతులు కొందరు పక్కనే ఉన్న మోటార్ల ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఎంతసేపటికి మంటలు అదుపులోనికి రాకపోవడంతో కందుకూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లింది.
జె.పంగులూరు: శ్రీరామనవమి పురస్కరించుకొని పంగులూరులో శనివారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ఒంగోలు జాతి, మైసూర్, నాటు ఎద్దులకు పోటీలు జరుగుతాయన్నారు. పోటీల్లో గెలిచిన ఎడ్లకు మొదటి బహుమతి రూ.20 వేలు, రెండో బహుమతి రూ.15 వేలు, మూడో బహుమతి రూ.10 వేలు, నాల్గవ బహుమతి రూ.7 వేలు, ఐదవ బహుమతి రూ.5 వేలు, ఆరవ బహుమతి రూ.3 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9848909630, 9948425772 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
త్రిపురాంతకం: వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు బాలాత్రిపురసుందరీదేవి అలంకారంలో అశ్వవాహనసేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పూజల్లో పాల్గొన్నారు. అశ్వవాహన సేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: మూడు సంవత్సరాల కాలంలో వందకు పైగా ఫారిన్ బాడీ ఆపరేషన్లు చేసి ప్రాణాలు కాపాడినట్లు డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో, పల్మనరి స్పెషాలిటీ వైద్య సేవలందిస్తున్న అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్రబాబు, డాక్టర్ భానుతేజ మాట్లాడుతూ... ఫారిన్ బాడీలు ఏర్పడినప్పుడు సకాలంలో వైద్య సహాయం అందించడం చాలా ముఖ్యమన్నారు. 3 నెలల పసిపిల్లల నుంచి 90 ఏళ్ల వృద్దుల వరకు ఫారిన్ బాడీ కేసులలో నాణ్యమైన వైద్య సహాయం అందించినట్లు తెలిపారు. గత మూడేళ్లుగా ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్లు చేసి వందలాది మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన సాంకేతికతను ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేసినట్లు చెప్పారు. తమపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మార్కాపురం టౌన్: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పట్టణంలోని జవహార్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. సుంకేసుల గ్రామానికి చెందిన ముంగమూరి చంటి(30) రెండేళ్లుగా స్థానిక జవహర్ కాలనీలో నివాసం ఉంటూ వాహన డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తతాన్నడు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్సై సైదుబాబు సంఘటనా స్థలానికి చేరుకొని ఇనుపగేట్‌కు ఉన్న తాళం పగులగొట్టించి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


