హనుమంతునిపాడు: సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా మండల పరిధి వెంగపల్లిలో శుక్రవారం ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. పోటీలు హోరాహోరీగా సాగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి ఐదు ఎడ్ల జతలు వచ్చాయి. బేస్తవారిపేట, మార్కాపురం, పుల్లల చెరువు, బొడిచర్ల, రాచర్ల మండలాల నుంచి ఎడ్ల జతలు పాల్గొన్నాయి. పోటీల్లో మార్కాపురం మండలం బొడిచర్లకు చెందిన తిండి నక్షత్రారెడ్డి ఎడ్లు 1220 అడుగులు లాగి ప్రథమస్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో మార్కాపురం జిల్లా పుల్లలచెరువు చెందిన బొర్రా రవిజేత ఎడ్లు నిలిచాయి. మూడో స్థానంలో గిద్దలూరు మండలం బురుజుపల్లికి చెందిన యర్రమల సాహితరెడ్డి ఎడ్ల జత నిలిచాయి. ప్రథమ బహుమతిగా రూ.50,116, రెండో బహుమతిగా రూ.40,116, మూడో బహుమతిగా రూ.30,116, నాల్గవ బహుమతిగా రూ.20,116 అందజేశారు. పోటీలు రాయి వెంకటేశ్వరరెడ్డి, దేవస్థాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.


