అశ్రునయనాలతో అనిల్‌, లియో అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో అనిల్‌, లియో అంత్యక్రియలు

Mar 29 2026 6:52 AM | Updated on Mar 29 2026 6:52 AM

విషాదం అలుముకున్న

పెదారికట్ల ఎస్సీ కాలనీ

కొనకనమిట్ల: మార్కాపురం వద్ద గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన తండ్రి, కొడుకు అంబటి అనిల్‌, ఐదు నెలల చిన్నారి లియో (పేరు పెట్టాల్సి ఉంది) మృతదేహాలకు శనివారం స్వగ్రామం పెదారికట్ల ఎస్సీ కాలనీలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయ విషాదకరమైన సంఘటనతో కాలనీలో విషాదం అలుముకుంది. జోహార్‌ అనిల్‌, జోహార్‌.. అంటూ గ్రామస్తులు, బంధుమిత్రుల ఆర్తనాదాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు.

అన్నప్రాసన రోజే అనంతలోకాలకు..

మండలంలోని పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన అంబటి అనిల్‌ (27) తన భార్య సౌజన్యతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అనిల్‌ చిన్న వయసులో ఉండగానే తల్లి నిర్మల చనిపోయింది. అప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యలైన మాలకొండయ్య, కమలమ్మల వద్ద ఉంటూ చదువుకొని ప్రయోజకుడయ్యాడు. రెండేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం రాగా సౌజన్యను వివాహం చేసుకొని హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అనిల్‌, సౌజన్య ముద్దుల తనయుడు ఐదు నెలల చిన్నారికి ఈ నెల 26వ తేదీ గురువారం పెదారికట్ల ఎస్సీ కాలనీలో అన్నప్రాసన జరగాల్సి ఉంది. చిన్నారికి లియో హృదన్‌ అనే పేరు పెట్టాలని నిర్ణయించి బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి ప్రైవేట్‌ బస్సులో తమ గ్రామానికి వస్తున్నారు. గురువారం ఉదయం బస్సు మార్కాపురం దాటింది. మరో 40 నిమిషాల్లో ఊరులో ఉంటామన్న ఆనందంలో ఉండగానే బస్సుకు యాక్సిడెంట్‌ జరగటం.. బస్సులో మంటలు చెలరేగటం క్షణాల్లో జరిగాయి. అనిల్‌, సౌజన్య, చిన్నారిని తీసుకుని బస్సు నుంచి బయటకు రావాలనే ప్రయత్నంలో సౌజన్య బయటపడి ప్రాణాలు దక్కించుకోగా మంటలు ఎక్కువై బయటకు రాలేక తండ్రి, కొడుకు ఇద్దరూ సజీవ దహనమై అన్నప్రాసన రోజే అనంతలోకాలకు చేరారు.

అల్లారు ముద్దుగా పెంచా:

మాలకొండయ్య, అనిల్‌ తాతయ్య

అనిల్‌ ఐదు నెలల వయసులోనే అమ్మ చనిపోయింది. అందరూ వాడిని నువ్వే సాకాలి అంటే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశా. చెప్పులు కుట్టి కూలీ నాలి చేసి పెంచా. వాడు కూడా మంచిగా చదువుకుని ప్రయోజకుడయ్యాడు. నన్ను అనిల్‌ చిన్నప్పటి నుంచి అయ్యా..అని ఆప్యాయంంగా పిలిచేవాడు. వాడు ప్రయోజకుడయ్యాడు. పెళ్లి చేశాం. ఇక ఇబ్బంది ఏమీ లేదని, నన్ను మంచిగా చూసుకుంటాడని, నాకు తలకొరివి పెడతాడని బతుకుతున్నా. ఇంతలో ఈ ఘోరం చూడాల్సి వచ్చిందంటూ అనిల్‌ తాతయ్య మాలకొండయ్య భోరున విలపించాడు. అన్నప్రాసన చేసేందుకు వస్తున్నాడని ఫంక్షన్‌కు అన్నీ ఏర్పాట్లు చేశాం. గురువారం ఉదయం ఒకసారి ఫోన్‌ చేసి మార్కాపురం దాక వచ్చామని, మరో కొద్దిసేపట్లో ఊరికి వస్తామని చెప్పాడు. మనవడి కోసం పెదారికట్ల బస్టాండ్‌లో ఎదురు చూస్తుండగా ఈ వార్త తెలిసి అందరం మార్కాపురం వెళ్లి మనవడు, మనవరాలు, ముది మనవడి కోసం ఎదురు చూశాం. మనవరాలు ఒక్కతే కనిపించింది. తండ్రి, కొడుకు ఇద్దరూ కనిపించక పోవడంతో గుండెలు పగిలిపోయాయని మాలకొండయ్య పిక్కటిల్లేలా ఏడ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement