దర్శి: క్రికెట్ బెట్టింగ్ కేసులో కమ్యూనికేటర్ బోర్డును ఆపరేటింగ్ చేసే ఇద్దరిని సీఐ వై.రామారావు శనివారం అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ నాగులమీరా, జరుగుమల్లికి చెందిన షేక్ సిద్ధయ్యలను అరెస్ట్ చేసి దర్శి కోర్టులో హాజరు పరిచారు. ఇద్దరికి కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
హనుమంతునిపాడు: మండల కేంద్రం హనుమంతునిపాడులో మతసామరస్యం వెల్లివిరిసింది. సీతారాముల వారికి ముస్లింలు వెండి పాదుకలను శనివారం సమర్పించారు. గ్రామస్తులు షేక్ షరీఫ్ బ్రదర్స్ సాఫ్టవేర్ ఉద్యోగులు. శనివారం స్వామి వారికి పాదుకలను బహూకరించారు. ఈ సందర్భంగా సీతారాముల వారికి రూ.లక్ష విలువైన వెండి పాదుకలు ఇవ్వాలని మొక్కు ఉండటంతో స్వామి వారికి ప్రత్యేకంగా పాదుకలు తయారు చేయించి గ్రామోత్సం చేస్తూ స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో వారి బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: విధి నిర్వహణలో ఊహించని ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని సుజాత నగర్‌లో నివశించే జంపాల వెంకట రమణయ్య ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో వున్న ఆయన శనివారం సాయంత్రం మోటారు బైకుపై భాగ్యనగర్ నుంచి వస్తుండగా ఒక్కసారిగా కుక్క అడ్డు వచ్చింది. దీంతో మోటారు బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటి గోడ తలకు తగిలింది. బలమైన గాయాలైన రమణయ్యను వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమణయ్య మృతి సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్ సీఐ జగదీష్ హాస్పిటల్‌కు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
● ఒకరికి గాయాలు
త్రిపురాంతకం: జాతీయ రహదారిపై బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. త్రిపురాంతకం మండలం శ్రీనివాసనగర్ సమీపంలో శనివారం సోమేపల్లి రోడ్డు దాటే క్రమంలో ఈప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సోమేపల్లి గ్రామానికి చెందిన ఎం.వెంకటకృష్ణ కాలు విరగ్గా తలకు బలమైన గాయమైంది. 108లో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం వినుకొండ తరలించారు.


