బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్..
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదంలో ఒంగోలు నగరానికి చెందిన ఓ న్యాయవాది దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఒంగోలుకు చెందిన న్యాయవాదులు గంటా శ్రీనివాసరావు, టి.విజయసారథి, కె.మారుతినందన్, పసుపులేటి వెంకట పవన్ కుమార్ బుధవారం రాత్రి రెండు మోటారు బైకులపై మద్దిపాడు మండలంలోని గ్రోత్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఒక హోటల్‌లో టిఫిన్ చేసి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటరాజువారిపాలెం వద్దకు రాగానే అతి వేగంగా వెళ్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో న్యాయవాది గంటా శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మారుతి నందన్‌ను తొలుత ఒంగోలులోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం చైన్నె తరలించారు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు న్యాయవాదులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన గంటా శ్రీనివాసరావు ఒంగోలు బార్ అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు రాజీవ్ నగర్‌లో నివసిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన గంటా శ్రీనివాసరావు కుటుంబానికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, న్యాయవాదులు ఇనకొల్లు వెంకటేశ్వర్లు, దారా వశిష్ట, వై.సునీల్ కుమార్, చక్కా బాలచెన్నయ్య, పెన్నా నాగరాజు, లక్ష్మణ్ కుమార్, కేవీ శేషారెడ్డి సంతాపం తెలిపారు. బార్‌లో న్యాయవాదులందరితో సన్నిహితంగా మెలిగే మంచి స్నేహితుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్రంగా గాయపడిన మరో న్యాయవాది
పరిస్థితి విషమం.. చైన్నెకి తరలింపు
న్యాయవాది ‘గంటా’ మృతికి వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ సంతాపం


