● జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్
మార్కాపురం: మనుషులు ఆవేశంలో విచక్షణ జ్ఞానం కోల్పోయి, నిగ్రహం నశించి చట్టాలను అతిక్రమిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మార్కాపురంలోని సబ్‌జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మంచి, చెడును గ్రహించే విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలన్నారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, అవి లేని రోజున సమాజంలో శాంతి ఉండదని అన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని చెప్పారు. అనంతరం వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జైల్లో అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆయన వెంట సబ్‌జైలు సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, ప్యానల్ న్యాయవాదులు ఎస్‌కే జహీర్, సలామ్, సిబ్బంది ఉన్నారు.


