నేటి నుంచి పొగాకు వేలం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పొగాకు వేలం

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

పెరిగిన నాణ్యత..తగ్గిన దిగుబడి

కందుకూరు: ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభంలో ఎదురైన జాప్యానికి తెరపడనుంది. ఎట్టకేలకు జిల్లాలో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం నుంచి జిల్లాలోని కందుకూరు, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రారంభం కానుంది. ఈ ఏడాది పొగాకు ధరలపై రైతులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతేడాది ధరలు లేక నష్టాలు మూటగట్టుకున్నామని, ఈ ఏడాదైనా గిట్టుబాటు ధరలు ఇచ్చి ఆదుకోవాలంటూ రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఈ ఏడాది ఆకు నాణ్యంగా ఉండటంతో ధరలు బాగుంటాయనే ఆశలు పెట్టుకున్నారు. అదే సందర్భంలో ప్రస్తుతం పొగాకు మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేదనే భయం కూడా రైతులను వెంటాడుతోంది. కర్ణాటక పొగాకు వేలంలో వస్తున్న ధరలే దీనికి కారణం. ఇటువంటి పరిస్థితుల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలం ప్రక్రియ రైతుల భవిష్యత్‌ను నిర్ణయించనుంది.

తొలి దశలో రెండు కేంద్రాలు

పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్‌ పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు, కొండపి, వెల్లంపల్లి, కందుకూరు–1, కందుకూరు–2, పొదిలి, కనిగిరి వేలం కేంద్రాలు జిల్లా పరిధిలో ఉంటే కలిగిరి, డీసీ పల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నాయి. వీటిలో కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో పొగాకు వేలాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగిలిన 9 వేలం కేంద్రాల్లో ఏప్రిల్‌ 9వ తేదీ నుంచి వేలం ప్రారంభమవుతుందని బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఏడాది పొగాకు వేలం ప్రారంభ ధరలపై రైతుల్లో పలు అంచనాలు ఉన్నాయి.

90.20 మిలియన్‌ కేజీలకు అనుమతి

2025–26 పొగాకు సీజన్‌కు సంబంధించి 11 వేలం కేంద్రాల పరిధిలో 90.20 మిలియన్‌ కేజీల పొగాకు విక్రయించుకునేందుకు బోర్డు అనుమతి ఉంది. ఈ ఏడాది పెరిగిన విస్తీర్ణం నేపథ్యంలో దాదాపు 130 మిలియన్‌ కేజీల వరకు ఉత్పత్తి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వేలం ప్రక్రియ ముందుగానే ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటికే ఆలస్యమైంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో వేలం ప్రక్రియ ముగియక పోవడంతో ఇక్కడ వేలం ప్రారంభం ఆలస్యమైంది. వచ్చే నెల నాటికి కాని కర్ణాటక వేలం ముగిసే అవకాశం లేనందున తొలి విడతగా రెండు వేలం కేంద్రాల్లో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రారంభ ధరలు ఎంత ఉంటాయనే దానిపై రైతుల్లో చర్చ నడుస్తోంది. ఈ ఏడాది పెరిగిన ధరలతో ఽగిట్టుబాటు ధరలు పెంచాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.

సరాసరి ధరలు మెరుగ్గా ఉంటేనే..

ధరలు లేక గతేడాది పొగాకు రైతులు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. నాణ్యత మెరుగ్గా ఉన్నందున ఆ మేరకు ధరలు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. కిలో పొగాకు రూ. 350 తగ్గకుండా ధరలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సరాసరి ధరలు కూడా తగ్గకుండా ధరలు ఉండాలని కోరుతున్నారు. కర్ణాటక మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో వ్యాపారులు ధరలు ఇవ్వలేదు. మొదట్లో రూ.320ల వరకు ధరలు ఇచ్చి ఆ తర్వాత కోత పెట్టి రూ.280 ఇచ్చారు. దీంతో సరాసరి ధరలు అక్కడి మార్కెట్‌లో రూ.230లు మించడం లేదు. ఇదే ధరలను వ్యాపారులు ఇక్కడి మార్కెట్‌లో అమలు చేస్తే రైతులకు కోలుకోలేని దెబ్బ తగలుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న పొగాకు వేలంలో ఏ మేరకు ధరలు వస్తాయో చూడాల్సి ఉంది.

తొలి విడతగా కందుకూరు–1, పొదిలి వేలం కేంద్రాల్లో ప్రారంభం

వచ్చే నెల 9వ తేదీ నుంచి మిగిలిన వేలం కేంద్రాల్లో కూడా..

పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ధరలపై ఆశలు పెట్టుకున్న రైతులు

ప్రస్తుతం మార్కెట్‌ ఆశాజనకంగా లేదంటూ ఆందోళన

కర్ణాటకలో రూ.230ల వరకు పరిమితమైన సరాసరి ధర

ఈ ఏడాది జిల్లాలో పండిన పొగాకు నాణ్యంగా మెరుగ్గా ఉండటం రైతులకు సానుకూలాంశం. దాదాపు 60 శాతం వరకు బ్రైట్‌ గ్రేడ్‌ ఉత్పత్తులు వచ్చాయని అంచనా వేస్తున్నారు. అదే సందర్భంలో దిగుబడులు మాత్రం తగ్గాయి. గతేడాది ఎకరానికి 9, 10 క్వింటాళ్ల ఆకు దిగుబడి వస్తే ఈ ఏడాది అది 6,7 క్వింటాళ్లకు మాత్రమే పరిమితమైందని రైతులు చెప్తున్నారు. దిగుబడి తగ్గినా విస్తీర్ణం ఎక్కువ ఉండటంతో బోర్డు అనుమతిని మించి ఉత్పత్తులు వస్తాయని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement