హామీల అమలులో చంద్రబాబు విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో చంద్రబాబు విఫలం

Mar 25 2026 6:54 AM | Updated on Mar 25 2026 6:54 AM

పుల్లలచెరువు: సూపర్‌ సిక్స్‌ పథకాలు హామీలు అమలు చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబునాయుడు.. గద్దెనెక్కిన తర్వాత ఆ సంగతే మరిచారని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పుల్లలచెరువు మండలంలోని మల్లాపాలెంలో శ్రీ సుబ్బారెడ్డి స్వామి తిరునాళ్ల సందర్భంగా సోమవారం రాత్రి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్రభపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించ లేదని, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వని చంద్రబాబు.. తన కుమారుడికి మాత్రం మంత్రి ఉద్యోగం ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. అర్హులైన వారికి పింఛను ఎగ్గొట్టారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను హామీ ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ది, సంక్షేమం ఊసే లేదని, రెడ్‌ బుక్‌ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 22 నెలల్లో రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, ఆ సొమ్మంతా టీడీపీ, జనసేన నేతలకు దోచి పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలని సూచించారు.

రాబోయేది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమేనని పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ప్రజలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మరో రెండేళ్లు ఓపిక పట్టాలని సూచించారు. రెడ్‌ బుక్‌ పేరుతో మంత్రి లోకేష్‌ అండ్‌ కో సాగిస్తున్న అరాచకాల్లో పాలుపంచుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులను ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, వారిని వదిలే ప్రసక్తి లేదని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ వాగ్యానాయక్‌, రాష్ట్ర వలంటరీ విభాగం కార్యదర్శి బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ ఎల్‌.రాములు, సర్పంచ్‌లు టి.సత్యనారాయణరెడ్డి, ఎ.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యుడు కె.రఘు, నాయకులు ఆవుల రవణారెడ్డి, గడ్డం సుబ్బయ్య, రోసిరెడ్డి, వాసు, శ్రీనివాసరెడ్డి, చరణ్‌రెడ్డి, నాసర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి, సంక్షేమాన్ని తుంగలో తొక్కారు

సుబ్బారెడ్డిస్వామి తిరునాళ్లలో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement