● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని, లేనిపక్షంలో వారు నివసిస్తున్న ఇళ్లకు ప్రభుత్వమే అద్దెలు చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పేదలకు నివేశిత స్థలాలు ఇవ్వాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల ఆజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్నా చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ఎకరా 99 పైసల చొప్పున సొంత వ్యక్తులకు కట్టబెడుతున్న చంద్రబాబుకు రాష్ట్రంలోని పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వడానికి మనసురావడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడ్కో గృహాల గురించి రచ్చ చేసిన కూటమి నాయకులు ఇప్పుడు టిడ్కో గృహాల గురించి నోరు విప్పకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ నగరంలోని సరళాదేవి నగర్, దత్తాత్రేయ కాలనీల్లో 20 ఏళ్లుగా ప్రజలు నివాసం ఉంటున్నప్పటికీ వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అర్హులైన వితంతువులు, వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాస్, ఎంఏ సాలార్, వీరారెడ్డి, హనుమారెడ్డి, ఎం.విజయ, చిరంజీవి, సీతారామయ్య, అంజయ్య పాల్గొన్నారు.


