అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Mar 18 2026 7:39 AM | Updated on Mar 18 2026 7:39 AM

యర్రగొండపాలెం: అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, రూ.10 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 13వ తేదీన మండల కేంద్రమైన పుల్లలచెరువులోని కమ్మవారిపల్లెలో నివాసం ఉంటున్న మేడికొండ వెంకటేశ్వర్లు పొలం పనులకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన సంగతి తెలిసిందే. అదే రోజు మధ్యాహ్నం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యర్రగొండపాలెం సీఐ కె.అజయ్‌కుమార్‌, ఎస్సై బి.సాంబశివరావు క్లూస్‌ టీం సాయంతో ఆధారాలు సేకరించగా నిందితులు ఎవరనేది తెలుసుకోగలిగామని డీఎస్పీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని నామనాయక్‌ తండాకు చెందిన కోడావత్‌ రాజు అలియాస్‌ కుమార్‌, దేవరకొండ మండలంలోని మైనంపల్లి తండాకు చెందిన వడితే సాయికిరణ్‌తోపాటు మరో ఇద్దరు కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు గతంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని, వీరిలో రాజు అనే వ్యక్తికి దాదాపు 100 చోరీ కేసుల్లో సంబంధం ఉందని చెప్పారు. స్థానిక మాచర్ల రోడ్డులోని మల్లాపాలెం గ్రామ క్రాస్‌ రోడ్డులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి, వారి నుంచి బంగారు చైన్‌, గొట్టాల గొలుసు, నల్లపూసల దండ, రెండు జతల మాటీలు, రెండు జతల జుంకాలు, రెండు జతల బుట్టకమ్మలు, ఒక జత రాళ్ల కమ్మలు, ఒక జత కమ్మలు, రెండు చిన్న ఉంగరాలు, వెండితో చేసిన 5 జతల కాళ్ల పట్టీలు, మొలతాడు, రెండు గ్లాసులు, ఒక స్పూన్‌, 3 కుంకుమ భరణెలు, 6 గిన్నెలు వెరసి మొత్తం రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు ఉపయోగించిన హోండా సిటీ పాతకారును సీజ్‌ చేశామని, బీరువా తాళాలు పగలకొట్టేందుకు ఉపయోగించిన రెండు ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. చోరీ కేసును సకాలంలో ఛేదించిన సీఐ, ఎస్సైని డీఎస్పీ అభినందించారు.

రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

నిందితుల వివరాలు వెల్లడించిన మార్కాపురం డీఎస్పీ నాగరాజు

పుల్లలచెరువులో చోరీ కేసును వేగంగా ఛేదించిన పోలీసులకు అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement