మట్టి మాఫియాకు యువకుడు బలి | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియాకు యువకుడు బలి

Mar 18 2026 7:39 AM | Updated on Mar 18 2026 7:39 AM

మట్టి మాఫియాకు యువకుడు బలి

కందుకూరు రూరల్‌: మట్టి మాఫియా యథేచ్ఛగా చెరువులో మట్టి తవ్వేయడంతో ఏర్పడిన పెద్ద పెద్ద గొయ్యిల్లో పడి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన కందుకూరు మండలం కొండికందుకూరు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బి.ప్రసాద్‌ (19) గేదెలు మేపుకునేందుకు పొలం వెళ్లాడు. పక్కనే ఉన్న చెరువులోకి గేదెలు తోలి శుభ్రం చేసేందుకు చెరువులోకి దిగాడు. లోతును గమనించకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. మట్టి మాఫియా చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి అధిక లోతుగా మట్టిని తీయడంతో పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. అవే ఈ ప్రమాదానికి కారణమయ్యాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేతికందివచ్చిన కుమారుడి అకాల మరణంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ఇద్దరిపై 6ఏ కేసు నమోదు

పామూరు: గ్యాస్‌ సిలిండర్ల అక్రమ నిల్వలపై అధికారులు దాడులు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మండల కేంద్రమైన పామూరుతోపాటు మండలంలోని గ్రామాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల అక్రమంగా నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు మంగళవారం ఎన్‌ఫోర్సుమెంట్‌ డీటీ కే.రాఘవేంద్ర భూపతి, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీహెచ్‌.రవిబాబు, విజిలెన్స్‌ డీసీటీఓ బి.రామారావు ఆధ్వర్యంలో రెండు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరి దుకాణాల నుంచి 35 డొమెస్టిక్‌ సిలిండర్లు, 4 కమర్షియల్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకుని వారిపై 6ఏ కేసు నమోదుచేసినట్లు విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. పామూరులోని పేట వీధి సమీపంలో షేక్‌.చిన్న ఖాజా రహమతుల్లా చెందిన రేకుల ఇంటిలో అక్రమంగా డొమెస్టిక్‌ సిలిండర్ల నిల్వ ఉంచి అధికధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఇండేన్‌ డొమెస్టిక్‌ ఫుల్‌ గ్యాస్‌ సిలిండర్లు 21, ఖాళీ సిలిండర్లు 02, భారత్‌ డొమెస్టిక్‌ ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు 12, ఇండేన్‌ కమర్షియల్‌ ఖాళీ గ్యాస్‌ సిలెండర్‌ 1 మొత్తం 36 స్వాధీనం చేసుకుని చిన్న ఖాజా రహమతుల్లాపై 6ఏ కేసు నమోదుచేశామన్నారు. అదేవిధంగా మండలంలోని నుచ్చుపొద గ్రామంలోని చాకలివీధిలో నివాసంలో కౌలూరి ఖాజా రసూల్‌ అక్రమంగా నిల్వ ఉంచిన 3 కమర్షియల్‌ ఖాళీ సిలెండర్లను స్వాధీనం చేసుకుని అతనిపై 6ఏ కేసు నమోదు చేసి సిలిండర్లను గ్యాస్‌ ఏజెన్సీకి అప్పగించినట్లు తెలిపారు. ఎవరైనా, ఎక్కడైనా అక్రమంగా డొమెస్టిక్‌ సిలిండర్లు నిల్వ ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్రమంగా నిల్వ ఉంచిన

గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement