కురిచేడు: మండలంలోని ఆవులమంద రోడ్డులోని ఐనవోలు మేజర్‌లోకి మహిళ మృతదేహం మంగళవారం కొట్టుకు వచ్చింది. ఏఎస్సై మోహనరావు కథనం ప్రకారం మార్కాపురం గ్రామానికి చెందిన గోగు గురవమ్మ(60) ఈనెల 9 వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మృతదేహం కాలువలో రబ్బరు చెట్లు తగిలి నిలిచిపోయింది. మృతదేహం బోర్లాపడి కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. కాలువలో మృతదేహన్ని వెలికితీసి విచారించగా మార్కాపురం మహిళళగా గుర్తించామన్నారు. మృతురాలి బంధువుల ద్వారా నిర్ధారణ చేసుకుని కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందజేసినట్లు తెలిపారు.
ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ మంగళవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం ప్రకారం..చీరాల రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 2025లో 7 ఏళ్ల బాలికపై బిట్ల అలియాస్ పిట్ల సూరిబాబు(45) నిర్మాణంలో ఉన్న ఒక డాబా ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లికి తెలియజేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేశారు. చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ నిందితుడ్ని అరెస్టుచేసి కోర్టులో ఛార్జీషీటు దాఖలుచేశారు. సాక్షులను విచారణ అనంతరం నిందితునిపై అభియోగం నిరూపణ అయినట్లు పేర్కొంటూ నిందితునికి పదేళ్ల కఠిన కారాగార ఽశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వంచే బాధిత బాలికకు రూ.75వేలు పరిహారం కింద చెల్లించాలని తీర్పులో వెలువరించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితునికి శిక్ష పడడంలో కృషిచేసిన ప్రత్యేక పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ మొయిన్, ఇతర అధికారులు, కోర్టు లయజన్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు.
● ఏప్రిల్ 8వ తేదీ లోగా
దరఖాస్తు చేసుకోవాలి
ఒంగోలు వన్‌టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు కేటాయించిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు 45 వరకూ ఉన్నాయని కలెక్టర్ పి.రాజాబాబు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–4 పోస్టులు 12 , క్లాస్–4, 30 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. జూనియర్ అసిస్టెంట్–2, టైపిస్టు–8, ఎంపిహెచ్‌ఏ సీ్త్ర,–1, ఏఎన్‌ఎం గ్రేడ్ 3, సీ్త్ర–1, ఫిషర్ మెన్–1, ఆఫీస్ సబార్డినేట్–13, మెసెంజర్–1, శానిటరీ మేసీ్త్ర–1, హెల్పర్–1, వాచ్‌మెన్–10, స్వీపర్–1, పీహెచ్ వర్కర్–2, పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అంధులకు–21, బధిరులకు–10, శారీరక వైకల్యం–4, ఆటిజం, మేధో వైకల్యం, నిర్ధిష్ట అభ్యాస వైకల్యం, మానసిక ఆరోగ్య, బహుళ వైకల్యాలు–7 పోస్టులుకు వేరు, వేరుగా దరఖాస్తులు చేయాలన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేది సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను, నిర్ణీత గడువు లోగా ప్రకాశం భవన్‌లోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.


