కన్నీళ్లు ఉప్పుంగి! | - | Sakshi
Sakshi News home page

కన్నీళ్లు ఉప్పుంగి!

Mar 18 2026 7:38 AM | Updated on Mar 18 2026 7:38 AM

ఉప్పు రైతుపై యుద్ధ ప్రభావం మూతపడుతున్న హోటళ్లు, కేటరింగ్‌ సర్వీసులు పడిపోయిన ఎగుమతులు కుప్పకూలిన ధరలు ఆందోళనలో రైతులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

రెండేళ్లుగా ఉప్పు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ధర ఉంటే ఉప్పు తయారీ ఉండదు. తయారీ ఉంటే ధర ఉండదు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండి ఉప్పు ఉత్పత్తి బాగా తయారవుతోంది. ఈ సారి మంచి ధర వస్తుందని ఆశించిన ఉప్పు రైతుకు పశ్చిమాసియా యుద్ధం శరాఘాతంగా మారింది. యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా గ్యాస్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, వాణిజ్య సిలిండర్లను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ప్రభావం పలు రాష్ట్రాల్లోని హోటల్‌ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాంతాల్లో రెస్టారెంట్లు, చిన్నా పెద్దా హోటళ్లు మూత పడ్డాయి. అలాగే కేటరింగ్‌ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా ఉప్పునకు డిమాండ్‌ తగ్గిపోయింది.

తగ్గిన ధరలు..

యుద్ధం కారణంగా హోటళ్లు, కేటరింగ్‌ సర్వీసులు మూతపడడంతో ఉప్పునకు డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో ధరలు బాగా పతనమైపోయాయి. యుద్ధానికి ముందు 76 కేజీల బస్తా ధర గత నెలలో రూ.280 ఉండగా ప్రస్తుతం రూ.200లకు పడిపోయింది. వాస్తవానికి ఉప్పు కనీస మద్దతు ధర రూ.250 ఉంటేనే రైతుకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి ఉంది. ప్రస్తుతం నాణ్యమైన ఉప్పు ధర రూ.200 పలుకుతుండగా, తక్కువ నాణ్యత గల ఉప్పు ధర రూ.170 నుంచి రూ.190 ధర ఉంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలంగా ఉండి ధరలు ఆశాజనకంగా ఉంటాయని ఆశించిన ఉప్పు రైతును యుద్ధం కోలుకోలేని దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పడిపోయిన ఎగుమతులు..

యుద్ధం ప్రభావం ప్రధానంగా హోటల్‌ రంగంపై పడడంతో ఉప్పు ఎగుమతులు తగ్గిపోయాయి. సింగరాయకొండ, చిన్నగంజాం నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు ఉప్పు సరఫరా అవుతుంది. మార్చి నెలకు ముందు ప్రతిరోజు మండలంలోని ఊళ్లపాలెం, బింగినపల్లి ప్రాంతాల నుంచి 5 నుంచి 7 లారీల వరకు ఉప్పు రవాణా చేసేవారు. ప్రస్తుతం కొనుగోలుదారుల కానీ, బ్రోకర్లు కానీ రాకపోవటంతో రోజుకు ఒక్క లారీ కూడా రవాణా కాని పరిస్థితి ఉంది. దీంతో ఉప్పుపై ఆధారపడే కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఉప్పుకు డిమాండ్‌ ఎప్పుడు వస్తుందోనని ఉప్పు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉప్పు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉప్పు కొనుగోలు చేయాలని ఉప్పు రైతులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఉప్పుసాగు ఇలా..

ఉమ్మడి జిల్లాలో కనపర్తి, చిన్నగంజాం, పాకల, ఊళ్లపాలెం, బింగినపల్లి గ్రామాల్లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతోంది. 7 వేలకు పైగా రైతులు 10 వేలకు పైగా కూలీలు ఉప్పు సాగు పై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం తప్ప సుమారు 9 నెలల పాటు ఉప్పు సాగవుతుంది. ఎకరాకు 76 కేజీలు ఉప్పు బస్తాలు 1,000 వరకు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రకారం ప్రతినెలా 25 వేల టన్నుల వరకు ఉప్పు ఉత్పత్తి వస్తుంది. గత సంవత్సరం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి లక్ష్యానికన్నా తక్కువగా అయింది. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, నాణ్యమైన ఉప్పు ఉత్పత్తి కావడంతో పాటు దిగుబడి బాగా వచ్చింది. అంతా ఆశాజనకంగా ఉందని రైతులు భావించారు. ఇంతలో వీరి ఆశపై యుద్ధం నీళ్లు జల్లింది. మంచి ఆదాయం వస్తుందని ఆశించిన రైతులకు యుద్ధం నడ్డివిరిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement