● కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా టెండర్ల ద్వారా అప్పగింత ● పచ్చదనం టెండర్లలో కూడా పోటీ లేకుండా సింగిల్ టెండర్ ఆమోదం ● కౌన్సిల్, అధికారుల తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ ● సాదాసీదాగా చివరి కౌన్సిల్ సమావేశం
ఒంగోలు సబర్బన్: అడ్డగోలుగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు...స్వయంగా కార్పొరేషన్ చేసుకోవాల్సిన పనులను కూడా కాంట్రాక్టర్లకు అప్పగించి దోచిపెడుతున్నారు. అదీ పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా పనులు అప్పగించి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నిలువునా పంచి పెడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ పఠాన్ ఇమ్రాన్ ఖాన్ కౌన్సిల్‌లో ధ్వజమెత్తారు. ఒంగోలు నగర పాలక సంస్థ చివరి కౌన్సిల్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కౌన్సిల్ హాలులో మేయర్ జి.సుజాత అధ్యక్షతన నిర్వహించారు. 20 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టారు. 9, 10 అంశాలను నిధుల దుర్వినియోగం కోసమే పెట్టారని 14వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ సీపీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అధికారులను నిలదీశారు. తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసే ప్రక్రియను ఒంగోలు నగర పాలక సంస్థ స్వయంగా చేపట్టవచ్చన్నారు. అలాంటిది తడి, పొడి చెత్తలను వేరుచేసి బయోవేస్ట్‌గా మార్చటానికి రూ.92 కోట్లు వెచ్చించాలని చూడటం అత్యంత దారుణమన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనున్నాయని, అయినా ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మాత్రం ప్రజా ధనాన్ని అప్పనంగా కాజేసే పనిలో నిమగ్నమయ్యారని మండిపడ్డారు. అదీ కూడా పోటీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారా ఏ విధంగా టెండర్‌ను ఆమోదిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా 10వ అంశంలో కర్నూలు రోడ్డు ఫ్‌లై ఓవర్ కింద ఖాళీ స్థలంలో మొక్కలు పెంచేందుకుగాను రూ.40 లక్షలు కేటాయించటం కూడా నిధులు దుర్వినియోగానికి పాల్పడటమేనన్నారు. అదీ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్ ద్వారానే కేటాయించటం అత్యంత దారుణమన్నారు. ఎస్‌ఎస్ ట్యాంకు–1కు ఉత్తరం వైపున 32వ డివిజన్ పరిధిలో పాత బైపాస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారని జనసేన సభ్యుడు, 18వ డివిజన్ కార్పొరేటర్ ఈదర సురేష్ బాబు(చిన్నారి) అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. కౌన్సిల్‌లో ఆమోదం లేకుండా, టెండర్ పిలవకుండా ఈ విధంగా పనులు చేస్తున్నారని నిలదీశారు. బీటీ రోడ్డు దాదాపు పూర్తయిందని, చివరగా ఒక లేయర్ బీటీ వేస్తే రోడ్డు పూర్తవుతుందని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. మరి టెండర్ పిలవకుండానే సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేయాల్సిన అవసరం కాంట్రాక్టర్‌కు ఎందుకు ఉంటుందన్నారు. అంటే అధికారులు ఆ కాంట్రాక్టర్‌కు ముసుగులో ఏమైనా డబ్బులు ముట్ట చెప్పారా అని పలువురు కార్కొరేటర్లు చెవులు కొరుక్కున్నారు. చివరకు 20 అంశాలతో కూడిన కౌన్సిల్ సమావేశం పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ పద్దతిపై హెల్త్ విభాగంలో కన్సల్టెంట్‌ను బీసీఎస్ డాక్టర్ పత్తిపాటి పల్లవిని నియమించేందుకు కౌన్సిల్ ఆమోదం కోసం పెట్టారు. అయితే కౌన్సిల్ ఆ నియామక ఆమోదాన్ని రద్దు చేసింది. గత కౌన్సిల్‌లో వాయిదా వేసిన 38వ డివిజన్‌లో పార్కుకు శ్రీ కృష్ణ దేవరాయ పార్కుగా నామకరణం చేయాలని స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన విన్నపాన్ని తిరిగి వాయిదా వేశారు. చివరకు కౌన్సిల్ చివరి సమావేశం సాదాసీదాగా సాగింది. కౌన్సిల్ సమావేశం అనంతరం కార్పొరేటర్లు అందరూ, అధికారులు కుటుంబ సభ్యులతో సహా వీడ్కోలు విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ కే.వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవ రావు, వేమూరి సూర్య నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ ఇమ్రాన్‌ఖాన్


