ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల వివరాలను కమిషనర్ కార్యాలయానికి పంపించాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. జిల్లాలో మూడేళ్ల నుంచి అసలు విద్యార్థులు లేకుండా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరాలు, జిల్లాలో కారుణ్య నియమకానికి అర్హులైన వారి వివరాలను ప్రభుత్వానికి 23వ తేదీ లోపు పంపాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 41 మంది ఉపాధ్యాయులను రోజుకు వారానికి ఒక పాఠశాల చొప్పున డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారన్నారు. అలా పనిచేసే ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఒక పాఠశాలకు శాశ్వతంగా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని డీఈఓ సీవీ రేణుకను కోరారు.
మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లాలో గ్యాస్‌కు కృత్రిమ కొరత సృష్టిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్‌లతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారులకు కృత్రిమ కొరత సృష్టించవద్దన్నారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించడం, ఎక్కువ రేట్లకు అమ్మడం, అక్రమంగా నిల్వచేయడం వంటివి చేయవద్దని హెచ్చరించారు. గ్రామాల్లో వినియోగదారులు సిలిండర్‌లు బుక్ చేసుకున్నప్పుడు అధిక ధరలు వసూలు చేయవద్దని చెప్పారు. పట్టణాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల వ్యవధితో గ్యాస్ బుక్‌చేయించుకోవాలని చెప్పారు. ఒక్క సిలిండర్ ఉన్నవారు 5 రోజుల ముందు బుక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ వినియోగదారులు కూడా స్పాట్ బుకింగ్ డిమాండ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి అంకయ్య, సివిల్ సప్లయ్ డీటీలు పాల్గొన్నారు.
ఒంగోలు టౌన్: కమ్యూనిటీ మెడిసిన్ విభాగంలో నిర్వహించిన జాతీయ అకడమిక్ సదస్సుల్లో ఒంగోలు విద్యార్థులు ప్రతిభ చాటారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అస్వన్ మార్గదర్శకత్వంలో రెండో సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్ సాయి ప్రత్యూష ఈ నెల 13,15 తేదీల్లో గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో జరిగిన జాతీయ సదస్సులో జెనరేషన్ జెడ్ 1997–2012 మెడికల్ విద్యార్థుల్లో డిజిటల్ డిటాక్స్ ప్రభావాన్ని అంచనా వేసే ఒక ఇంటర్వెన్షనల్ అధ్యయనం అనే అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. అలాగే ఇటీవల పుదుచ్చేరి జిప్మెర్ వైద్య కళాశాలలో జరిగిన సదస్సులో డాక్టర్ భాస్కరి మార్గదర్శకత్వంలో మూడో సంవత్సరం విద్యార్థిని షేక్ అలీనా పరిశోధన పత్రం సమర్పించారు. దీనికిగాను ద్వితీయ బహుమతితో పాటు రూ.6 వేల నగదు బహుమతిని గెలుచుకున్నారు. జాతీయ సదస్సులో పాల్గొని ద్వితీయ బహుమతులు సాధించిన పీజీలను మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏసుపాదం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీ విద్యార్థులు సాధించిన జాతీయ స్థాయి బహుమతులు ఒంగోలు జీఎంసీలో బలమైన పరిశోధనా వాతావరణం, అకడమిక్ ప్రతిభను చాటిచెబుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు జి.అశ్విన్, పి.దివ్య పాల్గొన్నారు.


