15 మంది సీఐలు, 25 మంది ఎస్సైలకు చార్జిమెమో బెట్టింగ్ వ్యవహారంపై ఎస్పీ హర్షవర్థన రాజు సీరియస్
ఒంగోలు టౌన్: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. టీ 20 ప్రపంచ కప్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జోరుగా బెట్టింగులు జరగడం, దర్శిలో పలువురు అరెస్టవడం తెలిసిందే. అయితే దర్శిలో అసలు బుకీలను ఒదిలిపెట్టి సబ్ బుకీలను అరెస్టు చేయడంపై మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ‘కేసును తిప్పేశారు’ అనే శీర్షికతో వచ్చిన కథనంతో ఎస్పీ హర్షవర్థన్ రాజు సీరియస్ అయ్యారు. ఊరూరా క్రికెట్ బెట్టింగులు జరుగుతున్నా పట్టించుకోకపోవడమే కాకుండా భారీ మొత్తంలో ముడుపులు తీసుకొన్న కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది బుకీలకు సహకరిస్తున్నట్లు ఎస్పీకి సమాచారం రావడంతో తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అధికారులకు నోటీసు ఇచ్చినట్లు సమాచారం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తమ పోలీసు స్టేషన్ పరిధిలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయడంలో విఫలం చెందినట్లు భావించిన ఎస్పీ జిల్లాలోని 15 మంది సీఐలకు, 25 మంది ఎస్సైలకు చార్జి మెమో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో చార్జి మెమోలు ఇవ్వడం జిల్లాలో ఇదే ప్రథమం. ఇది జిల్లా పోలీసు శాఖలో కలకలం సృష్టిస్తోంది.


