పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు పొగాకు బ్యారన్‌ దగ్ధం వడగాల్పులకు అప్రమత్తంగా ఉండాలి ప్రమాదానికి కారణం గంజాయి ముఠానే

ఒంగోలు: పోక్సో కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ పోక్సో కోర్టు జిల్లా న్యాయమూర్తి కె.శైలజ సోమవారం తీర్పునిచ్చారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గొట్టిపాటి శ్రీనివాసరావు కథనం ప్రకారం..బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామవాసి మోతుకూరి అలియాస్‌ కోలా పిచ్చయ్య 2024 ఏప్రిల్‌ 14న ఉదయం 7.30గంటల సమయంలో 10 ఏళ్ల బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా నిందితుడు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు బేస్తవారిపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అప్పటి ఎస్సై బి.నరసింహారావు కేసు నమోదుచేయగా అప్పటి మార్కాపురం డీఎస్పీ యం.బాలసుందరరావు దర్యాప్తు చేసి నిందితుడ్ని అరెస్టుచేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. కేసులో సాక్షులను విచారించిన అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అదే విధంగా బాధితురాలికి రూ.3లక్షలు పరిహారం అందేలా జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. లైంగిక దాడులకు పాల్పడే వ్యక్తులకు ఇటువంటి తీర్పులు గుణపాఠంగా నిలవాలని, బాలికలు ధైర్యంగా ఉండి ఏదైనా సమస్య వస్తే తక్షణమే తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం నుంచి తప్పించుకోలేరని ఎస్పీ హర్షవర్థన్‌ పేర్కొన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున వాదించిన స్పెషల్‌ పీపీ గొట్టిపాటి శ్రీనివాసరావు, సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు, లైజన్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

రూ.10 లక్షల ఆస్తినష్టం

మార్కాపురం: ప్రమాదవశాత్తు పొగాకు దగ్ధమై రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఈ సంఘటన సోమవారం తర్లుపాడు మండలంలోని నాయుడుపల్లి గ్రామంలో జరిగింది. మార్కాపురం ఫైర్‌స్టేషన్‌ ఆఫీసరు రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన చేతుల చిన్న వెంకటేశ్వర్లు, మాలకొండయ్య బ్యార్నీలో క్యూరింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు నిప్పురవ్వ తగులుకుని బ్యారన్‌ మొత్తం కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పొగాకు, బ్యారన్‌ దగ్ధమవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఒంగోలు సబర్బన్‌: ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉండడంతో, ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పి. రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సోమవారం కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా వీచే ప్రమాదం ఉందని, అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయట తిరగరాదని సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ను కూడా రూపొందించినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రతి మండల కార్యాలయాల్లో, సచివాలయాల్లో, ముఖ్య కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. వడగాల్పులు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన మందులు అన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మి ప్రసన్న, ఎస్‌డీసీ శ్రీధర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, స్టెప్‌ సీఈఓ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

గుడ్లూరు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై మోచర్ల–వీరేపల్లి వద్ద ఆటోని కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అయితే ప్రమాదానికి కారణమైన కారులో గంజాయి తరలిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గుడ్లూరు సీఐ, ఎస్సైలు సాంకేతిక పరిజ్ఞానంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఒరిస్సా నుంచి చైన్నెకు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి గంజాయి స్వాధీనం చేసుకొని నింది తులను అదుపులోనికి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement