ఒంగోలు టౌన్: సింగరాయకొండ చైతన్య కోచింగ్ సెంటర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సయ్యద్ తౌషిక్‌ది ముమ్మాటికీ హత్యేనని, బాలుడి మృతిపై జ్యుడీషియల్ విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తౌషిక్ తల్లిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీలతో కలిసి ప్రజా సంఘాల నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన స్పెషల్ పార్టీ పోలీసులు, ఒన్‌టౌన్ సీఐ నాగరాజు, టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు కలెక్టరేట్ ప్రధాన గేటు మూసివేసి ప్రజా సంఘాల నాయకులు, బాధిత కుటుంబాన్ని అడ్డుకున్నారు. దీంతో గేటు బయట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు మాట్లాడుతూ... విచారణ పూర్తి కాకముందే తౌషిక్ ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ప్రకటించడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. తౌషిక్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు ఆత్మహత్యగానే చెబుతున్నారని, అదే కోణంలో విచారణ కూడా జరుగుతుందని బాధిత కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఆత్మహత్యకు ముందు తల్లితో మాట్లాడిన తౌషిక్ విచారంగా కనిపించినట్లు విచారణలో తెలిసిందని డీఎస్పీ చెబుతున్నాడని, అదే నిజమైతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యంపై లేదా అని ప్రశ్నించారు. నిరుపేద మైనారిటీ కుటుంబానికి చెందిన బాలుడు కనుకే అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు కె.వీరారెడ్డి మాట్లాడుతూ.. త్రిసభ్య కమిటీ విచారణ ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేసిన త్రిసభ్య కమిటీ సభ్యుల చర్యలను తప్పుపట్టారు. పాఠశాల యాజమాన్యం తన రాజకీయ, ఆర్థిక పలుకుబడితో అధికారులను లోబరుచుకున్నారని ఆరోపించారు. బాలుడు మృతి చెంది నెల రోజులు కావస్తున్నా స్థానిక మంత్రి డోలా బాలవీరాంజనేయులు, అధికార పార్టీకి చెందిన ఇతరా ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర మంత్రిగా ఆయనకు ఆ బాధ్యత లేదా అని నిలదీశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, 5 ఎకరాల పొలం, రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్‌డీపీఐ రాష్ట్ర నాయకులు షేక్ సత్తార్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్ధి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చూపడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో పలు విద్యాలయాల్లో జరుగుతున్న హత్యాచారాలను ఆత్మహత్యలుగా చిత్రీకరించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. తౌషిక్ తలిదండ్రులు సయ్యద్ అలీ, మౌలాబీ మాట్లాడుతూ..పోలీసులు, అధికారులు అమ్ముడుపోయారని ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాం శ్రీనివాసరావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి బి.పద్మ, నల్లూరి క్రాంతి, సీపీఎం నాయకులు సయ్యద్ హుసేన్, సీపీఎం ఎల్ నాయకులు నాంచార్లు, ఆర్ మోహన్ పాల్గొన్నారు. అనంతరం డీఆర్‌ఓను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆత్మహత్య చేసుకున్నట్లు డీఎస్పీ ప్రకటించడం దారుణం
పాఠశాల యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలి
బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రజా ప్రతినిధులకు మనసెందుకు రావట్లేదు
పోలీసు విచారణపై నమ్మకం లేదు, జ్యుడీషియల్ విచారణ జరపాలని డిమాండ్


