వెట్టిచాకిరి నుంచి విముక్తి | - | Sakshi
Sakshi News home page

వెట్టిచాకిరి నుంచి విముక్తి

Mar 17 2026 7:25 AM | Updated on Mar 17 2026 7:25 AM

ఒంగోలు వన్‌టౌన్‌: పదేళ్లుగా బాండెడ్‌ లెబర్‌ కింద వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించింది. వివరాల్లోకి వెళితే..కురిచేడు మండలం వీవై కాలనీకి చెందిన చెంచు గిరిజన కుటుంబాలకు చెందిన 29 మంది బాండెడ్‌ లెబర్‌ కార్మికులుగా నాగర్‌కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం కల్వకుర్తి రోడ్డుకు సమీపంలోని బొగ్గు బట్టీలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇండియా లేబర్‌ లైన్‌ సంస్థతో కలిసి నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఆర్డీఓ ఆదేశాల మేరకు తెలకపల్లి తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, ఎస్సై నరేష్‌ పోలీస్‌ బృందం, కార్మిక శాఖ అధికారి రాజ్‌కుమార్‌, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి శ్రీశైలం కలిసి బాధితులు వెట్టి చాకిరి చేస్తున్న పనిప్రదేశానికి వెళ్లి కార్మికులను విచారించారు. విచారణలో తాము పదేళ్లుగా బొగ్గు బట్టీల్లో బలవంతపు పని చేస్తున్నామని అధికారుల ఎదుట వాపోయారు. మొత్తం ఆరు కుటుంబాలకు చెందిన పురుషులు, మహిళలు, పిల్లలు కలిపి 29 మందిని బాండెడ్‌ లేబర్‌ పరిస్థితుల నుంచి రక్షించి తదుపరి పునరావాస చర్యల కోసం జిల్లా కార్మిక శాఖ, జిల్లా బాలల సంరక్షణ కమిటీకి అప్పగించారు. అనంతరం వారిని సురక్షితంగా వారి స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం వీవై కాలనీకి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి బొగ్గు బట్టీ యజమాని లాలుపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వెట్టి చాకిరి నుంచి రక్షించిన కార్మికులను సోమవారం ఒంగోలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద కలెక్టర్‌ పి.రాజాబాబు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా కార్మికులు తామ పడుతున్న బాధలను కలెక్టర్‌కు వివరించారు. కార్మికులకు తక్షణంగా అవసరమైన సహాయం, పునరావాస చర్యలు చేపట్టాలని..ఆ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల్లో శివ పార్వతి, శివ దంపతులకు జన్మించిన రెండు నెలల పాపకు ‘ప్రేరణ’ అనే పేరు నామకరణం చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా మాట్లాడుతూ కార్మికులను తక్షణమే వారి గ్రామానికి పంపించేలా చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కార్మిక శాఖ అధికారి గాయత్రి దేవి, జి.నాగేశ్వరరావు, దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ స్టేట్‌ కో ఆర్డినేటర్‌ హేమలత, ఇండియా లేబర్‌ లైన్‌ గుంటూరు జిల్లా ఇన్‌చార్జి అయాన్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement