● జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు
మార్కాపురం టౌన్: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు రెవెన్యూ సమస్యలే అధికంగా వస్తున్నాయని, సంబంధిత రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించి న్యాయంచేయాలని జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 181 అర్జీలు రాగా అందులో 124 రెవెన్యూ సమస్యలపై ఉన్నాయన్నారు. అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సమస్యలపై ఆలస్యం చేయకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా స్ధాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మార్కాపురం: పోలీసుల వద్దకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు తెలిపారు. మార్కాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జిల్లా వ్యాప్తంగా 32 అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారునితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు పంపుతున్నామని సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదు దారులకు దగ్గరలో ఉన్న పోలీసుస్టేషన్ ఎస్సై, సీఐలతో మాట్లాడారు. చట్టప్రకారం విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు గురికావద్దని, ఎవరూ ఉద్యోగాలు ఇప్పించలేరని, ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ ద్వారానే పరీక్షలు రాసి పాసై ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. పొదిలి, గిద్దలూరు, కంభం సీఐలు రాజేష్‌కుమార్, రామకోటయ్య, మల్లికార్జున పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.


