● 5 నెలల క్రితం జరిగిన చోరీ కేసులో దొంగల అరెస్టు
ఒంగోలు టౌన్: అందరూ ప్రయాణికుల్లాగే బస్సు ఎక్కారు. అదును చూసి లగేజీ బ్యాగును కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపిన వివరాల ప్రకారం...బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన బోయిన హిమబిందు, బాబురావు దంపతులు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో స్వగ్రామానికి వచ్చిన ఆ దంపతులు 2వ తేదీన తిరుగు ప్రయాణమయ్యారు. బస్సు ఒంగోలు సౌత్ బైపాస్ వద్దకు రాగానే భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్ వద్ద ఆపారు. హిమబిందు, బాబురావు ఇద్దరూ బస్సు దిగి భోజనం చేసి మళ్లీ బస్సు ఎక్కారు.
మరుసటి రోజు బెంగళూరు చేరుకున్న ఆ దంపతులు బ్యాగు తెరిచి చూడగా అందులో నగలు కనిపించలేదు. ప్రయాణ సమయంలో బస్సులో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన తాలుకా పోలీస్‌స్టేషన్ సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలోని బృందం లోతుగా దర్యాప్తు చేపట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సీసీ కెమెరాలు పరిశీలించి నిందితులను పసిగట్టింది. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాకు చెందిన ఫిరోజ్, హైదర్‌లు బ్యాగు చోరీ చేసినట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని 120 గ్రాముల నగలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో నగల బ్యాగులను బాధిత కుటుంబానికి అందజేశారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలుకా సీఐ విజయకృష్ణ, ఎస్సై రామకృష్ణ, హెడ్‌కానిస్టేబుళ్లు అన్వర్‌బాషా, రామకృష్ణ, ఆర్.రాంబాబులను ఎస్పీ అభినందించారు.


