గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేవు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందులు లేవు

Mar 17 2026 7:24 AM | Updated on Mar 17 2026 7:24 AM

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ రాజాబాబు

ఒంగోలు సబర్బన్‌: మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో గ్యాస్‌ వినియోగదారులకు సిలిండర్ల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్‌ పి.రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని కలెక్టరేట్లో వీసీ హాల్లో జేసీ కల్పనాకుమారితో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వంట గ్యాస్‌ నిల్వల పరిస్థితి, సరఫరా, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టిన చర్యల గురించి కలెక్టర్‌ వివరించారు. ఇరాన్‌ – ఇజ్రాయిల్‌, అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల మూలంగా గ్యాస్‌ నిల్వలు తగ్గి ధరలు పెరుగుతాయని సోషల్‌ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో గృహ వినియోగదారుల అవసరాలకు సరిపడా పూర్తి స్థాయిలో ఎల్పీజీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లు నమ్మి ఆందోళనకు గురికావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో 5,51,759 డొమెస్టిక్‌ ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, మార్కాపురం జిల్లాలో 3,22,279 డొమెస్టిక్‌ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ప్రకాశం జిల్లాలో 39 గ్యాస్‌ ఏజెన్సీలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 25 గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నట్లు తెలిపారు. డొమెస్టిక్‌ ఎల్పీజీ వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రోజుకు సగటున 9,875 సిలిండర్లు అవసరం కాగా, డీలర్ల వద్ద 11,542 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులకు ఫస్ట్‌ ఇన్‌ – ఫస్ట్‌ అవుట్‌ విధానంలో వాటిని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో స్టాక్‌ కొరత అనేది ఎక్కడా లేదన్నారు. ప్రతిరోజూ సంబంధిత డీలర్లతో జేసీ సమావేశమవుతూ రోజువారీ నిల్వలు, బుకింగ్‌, పంపిణీ విధానాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆస్పత్రులకు కూడా ప్రాధాన్యతగా గ్యాస్‌ సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో వంటగ్యాస్‌ సరఫరా సజావుగా జరుగుతోందన్నారు. ఎల్పీజీ నిల్వలు, పంపిణీ గురించి ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా విడుదల చేస్తున్న సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు కలెక్టర్‌ పిలుపునిచ్చారు. పుకార్లను నమ్మి అనవసరమైన అపోహలు, ఆందోళనలతో అవసరానికి మించి అదనంగా సిలిండర్లు బుక్‌ చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. అవసరం ఉన్నప్పుడే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని వినియోగదారులకు కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితులను ఆసరాగా తీసుకుని రూమర్స్‌ క్రియేట్‌ చేయడం, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, ఏజెన్సీల వారు ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం, బ్లాక్‌ మార్కెటింగ్‌ వంటి చర్యలు ఎవరైనా చేపడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్‌ సరఫరాలో ఎటువంటి అక్రమ కార్యకలాపాలు జరగకుండా అధికారులు కఠినంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రతి వినియోగదారునికి అవసరమైన గ్యాస్‌ సిలిండర్‌ అందేలా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement