వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
ఒంగోలు సిటీ: రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని వైఎస్సార్ సీపీ నాయకులు కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి పాల్గొని మాట్లాడారు. పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించారని కొనియాడారు. మన రాష్ట్రం ఏర్పడక ముందు మద్రాస్ రాష్ట్రంలో ఉండేవారిమని, పొట్టి శ్రీరాములు త్యాగం వలనే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి తెలిశాయని వివరించారు. పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, నాయకులు రొండా అంజిరెడ్డి, దేవరపల్లి అంజిరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, రాయని వెంకటరావు, దాసరి కరుణాకర్, పేరం ప్రసన్న, మీరవళి, ప్రసాద్, మేళం మధు, జిలానీ బాషా, తదితరులు పాల్గొన్నారు.


