ఒంగోలు సిటీ: జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆయా కేంద్రాల్లో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేసినట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభం కాగా, నగరంలోని పీవీఆర్ బాలికలు, బాలుర పాఠశాల పరీక్ష కేంద్రం, గౌతమ్ స్కూల్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజాబాబు ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులకు కల్పించిన వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా చిన్న లోటుపాట్లు కూడా ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 165 పరీక్ష కేంద్రాల్లో 28,632 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. వీరిలో రెగ్యులర్ విభాగంలో 14,289 మంది బాలురు, 14,312 మంది బాలికలు, ప్రైవేట్ విభాగంలో 21 మంది బాలురు, పది మంది బాలికలు ఉన్నారని కలెక్టర్ వివరించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని కూడా అవసరమైన మందులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఈఓ సి.వి.రేణుక, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, అధికారులు ఉన్నారు.


