గిద్దలూరు రూరల్: జాతీయస్థాయి కరాటే పోటీల్లో గిద్దలూరు విద్యార్థులు సత్తాల చాటారు. పట్టణంలోని సంజీవిని గురుకుల అనాథ ఆశ్రమంలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న 8 మంది విద్యార్థులు ఈ నెల 15వ తేదీ హైదరాబాద్‌లో నిర్వహించిన కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. చరణ్ అకాడమీ ఆర్గనైజేషన్ కిన్నెర రవి ఆధ్వర్యంలో కటాస్, స్పారింగ్ ఫైట్ విభాగంలో పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థిని కీర్తన, 8వ తరగతి విద్యార్థి బ్లెస్సీ, ఎంపీపీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న పద్మశ్రీ, పూజ, నాగమ్మ, రుత్విక్, 5వ తరగతి చదువుతున్న రంగపూజిత, ప్రకాష్‌లు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్గనైజర్ ఓబులపురం రాజశేఖర్‌తో పాటు కరాటే మాస్టర్ బూతరాజు శ్రీను, తదితరులు విద్యార్థులను అభినందించారు.


