ప్రజాదరణ చూసిపచ్చనేతలకు మతి భ్రమించింది
యర్రగొండపాలెం: సంక్రాంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలకు విశేష ఆదరణ, వచ్చిన జనాదరణ చూసి పచ్చ నాయకులకు మతి భ్రమించిందని వైఎస్సార్ సీపీ నాయకులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పాల్గొని మాట్లాడారు. మతి భ్రమించిన వారికి ఎమ్మెల్యే అనే పదానికి అర్థం తెలియడం లేదని, సర్పంచ్ పదవికి కూడా అనర్హులు కాని వారంతా ఎమ్మెల్యేపై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికార మదంతో పోలీసుల అండచూసుకొని ప్రజల ఓట్లతో ఎన్నికై న ఎమ్మెల్యే పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇసుక, మట్టి, పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం దోచుకుంటున్నారని, అటువంటి వారే టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ క్రెడిబుల్‌టీ ఉన్న వ్యక్తి కావడం వల్లే ప్రజల పక్షాన నిలబడి అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందేలను గాడిద పందాలని ఎగతాళి చేసిన టీడీపీ నాయకులు ఒంగోలు జాతి సంరక్షణ కమిటీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చిలకలూరిపేట, నరసరావుపేటలలో నిర్వహించిన పందేలు కూడా గాడిద పందాల అని వారు ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు. యర్రగొండపాలెం, పెద్దదోర్నాలలో ఆర్టీసీ బస్టాండ్, ఏఎంసీ కార్యాలయాలు, రైతు బజార్ ఏర్పాటు, 100 పడకల వైద్యశాల, నాడు–నేడు కింద నియోజకవర్గంలోని పాఠశాలలు ఆధునికీకరణ, రోడ్లు అభివృద్ధి లాంటివి అనేకం జరిగాయని గుర్తు చేశారు. 18 నెలల చంద్రబాబు పాలనలో ఏం చేశారని చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వ కాలంలో మంజూరై ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయిన రోడ్ల పనులు ఇప్పుడు ప్రారంభించి తమ ఖాతాలో వేసుకొని జబ్బలు కొట్టుకుంటున్నారన్నారు. 2029లో జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే చంద్రశేఖర్ మరోసారి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని, దమ్ముంటే ఎరిక్షన్‌బాబు టికెట్ తెచ్చుకొని పోటీ చేయాలని, అప్పుడు ఆయనకు కనీసం డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని సవాల్ విసిరారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన వైఎస్సార్ సీపీ జెండా రెపరెపలాడుతుందన్నారు. ప్రస్తుతం 96 పంచాయతీల్లో 80 మంది సర్పంచ్‌లు మా పార్టీకి చెందినవారేనని గుర్తు చేశారు. స్థాయి లేని నాయకులు మాట్లాడే సమయంలో ఎదుటి వారి స్థాయిని గుర్తించాలని, లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుముల అరుణ, ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్.బుజ్జి, మండల పార్టీ కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంటా వెంకట రమణారెడ్డి, దోమకాల వెంకటేశ్వర్లు, సింగారెడ్డి పోలిరెడ్డి, పాలిరెడ్డి కృష్ణారెడ్డి, పెద్దారవీడు ఎంపీపీ బెజవాడ పెద్దగురవయ్య, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కె.ఓబులరెడ్డి, సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, ఆర్.అరుణాబాయి, తోకల ఆవులయ్య, యేర్వ శేషసేనారెడ్డి, ఎల్.రాములు, పి.రాములు నాయక్, షేక్.ఫజుల్, షేక్.మహమ్మద్ కాశీం, సింగా ప్రసాద్, ఒంగోలు సుబ్బారెడ్డి, పెద్దకాపు వెంకటరెడ్డి, వై.రాంబాబు, టి.రాంబాబు, కొండయ్య, ఆవుల రమణారెడ్డి, పల్లె సరళ పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యేపై పిచ్చిప్రేలాపనలు చేయడం తగదు
అధికార మదంతో ప్రోటోకాల్ లాక్కున్నారు
విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకుల ధ్వజం


