భక్తిభావాన్ని చాటిన ‘షిర్డీ సాయి దివ్య చరితం’
ఒంగోలు మెట్రో: స్థానిక పీవీఆర్ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఆర్ కళాపరిషత్ హాలులో సోమవారం రాత్రి శ్రీ నళినీ ప్రియ కూచిపూడి నృత్యానికేతన్ వారు ప్రదర్శించిన శ్రీ షిర్డీ సాయి దివ్య చరితం అనే కూచిపూడి నృత్య రూపకం ప్రేక్షకులను భక్తిభావ సముద్రంలో ముంచెత్తింది. సాయి బాబా జీవితం, బోధనలు, మహిమలను కళాత్మకంగా ఆవిష్కరించిన ఈ ప్రదర్శన ఆధ్యాత్మికతకు అద్భుతమైన దర్పణంగా నిలిచింది. సాయి బాబా షిర్డీ ప్రవేశం శాంత స్వరూపంగా, దైవత్వాన్ని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. ఆయన చూపిన కరుణ, జీవ కారుణ్యం, దుఃఖితుల పట్ల అపారమైన ప్రేమ, సహానుభూతి నాట్యాభినయంతో హృదయాన్ని తాకి ఆకట్టుకుంది. ఈ నృత్య రూపకంలో మత సామరస్యం ప్రధాన సందేశంగా నిలిచింది. ఈ ప్రదర్శనలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


