ప్రయాణం చేయలేక!
● సరైన ప్రత్యామ్నాయం చేయని ఆర్టీసీ
కనిగిరిరూరల్: సంక్రాంతి పండుగ ముగిసింది. పల్లెల నుంచి పట్టణాలకు విద్యార్థులు, ఉద్యోగులు, బంధుగణం తిరుగు ప్రయాణబాట పట్టారు. దూరప్రాంతాల నుంచి పండగ సంబరాలను కుటుంబ సమేతంగా స్వగ్రామాల్లో చేసుకునేందుకు వచ్చిన వారు విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, వైజాగ్ తదితర ప్రాంతాలకు తిరుగు ప్రయాణం కావడంతో పట్టణంలో ట్రాఫిక్ పెరిగింది. ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల రద్దీ పెరిగి. ప్లాట్ ఫారంలో నిలబడేందుకు చోటు కరువైంది. కనిగిరి అనగానే గుర్తుకు వచ్చే వలస జీవులు అధికారిక లెక్కల ప్రకారమే సుమారు 45 వేల మంది ఓటర్లు కనిగిరి వాసులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆదివారం అమావాస్య కావడంతో కొందరు శనివారం రాత్రి వెళ్లారు. మిగతా వారంతా పూర్తి స్థాయిలో సోమవారం ప్రయాణమయ్యారు. బస్సులు లేక పోవడంతో ప్రయాణికులు గ్యారేజ్ పాయింట్ వద్దకు కూడా వెళ్లి బస్సులో సీటు కోసం ఎగబడిన దృశ్యాలు సోమవారం కనిగిరి ఆర్టీసీ డిపోలో కన్పించాయి. ప్రధానంగా కనిగిరి టు విజయవాడ, కనిగిరి టు ఒంగోలుకు బస్సుల్లో ప్రయాణికుల తోపులాటలు కనిపించాయి. ఉచిత బస్సుల్లో అయితే ఇక ఖాళీ అనే మాటే కన్పించలేదు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ రేట్లను పెంచి దోచుకున్నారు. సాధారణ సమయంలో ఉండే టిక్కెట్లు రేట్లకు రెండితలు అధిక ధరలు పెంచినట్లు ప్రయాణికులు తెలిపారు. త్వరగా వెళ్లాలి అనుకున్న వారు కొందరు మంది కనిగిరి డిపో నుంచి నేరుగా విజయవాడకు బస్సులు ఖాళీ లేక పోవడంతో పొదిలి, కందుకూరు డిపోలకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు మాట్లాడుకుని వెళ్లారు.
మార్కాపురంలో...
మార్కాపురం: సంక్రాంతి పండుగ అనంతరం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, నంద్యాల, శ్రీశైలం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తగినన్నీ బస్సు సర్వీసులు లేకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది. బస్సు కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కే వారు కొందరైతే, కిటికీల్లో నుంచి దూరి కండువాలు, కర్చీఫ్‌లు వేసే వారితో ఆ ప్రాంగణం మొత్తం గందరగోళంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే పండగకు వచ్చిన బంధుమిత్రులంతా బస్టాండ్‌కు వచ్చి బస్సులు లేక విసుగుచెందారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ, ఒంగోలుకు 7 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని, సోమవారం రాత్రికి హైదరాబాద్‌కు 3 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డీఎం నరసింహులు తెలిపారు. పండుగ అనంతరం ఉద్యోగాలు చేసే ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ప్రజలు తగినన్నీ బస్సులు లేకపోవడంతో నిరుత్సాహ పడ్డారు. బెంగళూరు, చైన్నెకి వెళ్లే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు బస్సులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయించారు. మార్కాపురం నుంచి చైన్నెకి నేరుగా ఆర్టీసీ బస్సు లేదు. గిద్దలూరు డిపో నుంచి మాత్రమే చైన్నెకి వెళ్లే బస్సు ఉంది. కొంత మంది బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను బాడుగకు మాట్లాడుకొని వెళ్లారు.
ప్రయాణం చేయలేక!
ప్రయాణం చేయలేక!


