బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలి
● ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదేశించారు. స్థానిక కార్యాలయంలో ఇన్‌చార్జి ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అధ్యక్షతన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ చేసి సత్వర పరిష్కారం కల్పిస్తామని, బాధితులకు భరోసా కల్పించారు. ఫిర్యాదులపై ఆయా స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియచేసి త్వరితగతిన విచారించి న్యాయం చేయాలన్నారు. ప్రతి ఫిర్యాదును నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 37 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో డీఎస్పీ యు నాగరాజు, సీఐ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.


