రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన

Dec 9 2025 10:43 AM | Updated on Dec 9 2025 10:43 AM

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన

రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పరిపాలన

పశ్చిమ ప్రకాశానికి సంజీవని మెడికల్‌ కళాశాల ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం మోంథా తుపానుతో పంట నష్టపోయిన రైతులకు అర్ధరూపాయి ఇచ్చారా..? మార్కాపురం ఆర్ధికంగా ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చెప్పాలి యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పశ్చిమ ప్రకాశానికి సంజీవనిలా వైద్య కళాశాలను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఆ మెడికల్‌ కళాశాలను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, నిజంగా ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి, ప్రభుత్వం అనుమతి, ప్రభుత్వ డబ్బుతో నిర్మాణం, ప్రభుత్వమే పెట్టే వైద్యులు, మరి ప్రైవేటు వారు ఎందుకు ? ప్రైవేటు వారి వద్ద డబ్బులు దండుకోవడానికేనా అని ప్రశ్నించారు. మెడికల్‌ కాలేజీల స్థలం వందల కోట్ల రూపాయలని, ముందు అది తెలుసుకోవాలన్నారు. నిర్మాణం చాలా వరకు పూర్తయిందని, వైద్యులు ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారని చెప్పారు. మెడికల్‌ కాలేజీ ఉంటే పేద విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. సంవత్సరానికి 50 నుంచి 100 మంది వరకు డాక్టర్లు అయ్యే అవకాశం ఉందన్నారు. మెడికల్‌ కాలేజీ ఉండటం వల్ల అన్నీ విభాగాలకు చెందిన నిపుణులు అక్కడ ఉంటారన్నారు. పేదవాడికి మంచి వైద్యం అందడానికి మార్కాపురం వేదిక అవుతుందన్నారు. అలాంటి వైద్యాన్ని దూరం చేసి చంద్రబాబు ప్రభుత్వం ఏం సాధిస్తుందన్నారు. ఇటీవల మోంథా తుపాను ప్రభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు అర్థరూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసిందని ధ్వజమెత్తారు. వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేసి ప్రైవేటు వారికి ఇవ్వడానికేనని విమర్శించారు. రైతు అరటిని అమ్మేది అర్ధరూపాయికి, మరలా కొనాలంటే పదిరూపాయలకి ఇదేమీ న్యాయమన్నారు. అడ్డదారుల్లో బియ్యం బొక్కేస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిందని ధ్వజమెత్తారు. దేశంలో మన రాష్ట్ర పోలీసులు 36 వ ర్యాంకుతో చిట్టచివరి స్థానంలో ఉన్నారని, పోలీసు అధికారులు నిద్ర లేవాలన్నారు. ఒక నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టినరోజుకు పసుపుబొకే తీసుకెళ్లి పోలీసులు ఇస్తున్నారని విమర్శించారు. సంబరాలు చేసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కాపురం జిల్లాకు ఏం చేశారో చెప్పాలన్నారు. జిల్లా కేంద్రంగా మార్కాపురం ప్రకటించడం వల్ల ఆర్ధికంగా ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చెప్పాలన్నారు. అత్యధిక భూమి ఉన్న దొనకొండను, దర్శిని ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లారని, మరి మార్కాపురానికి ఏం మిగిలిందన్నారు. యర్రగొండపాలెం అంతర్భాగంలోని శ్రీశైలంను నంద్యాల వారికి ఇచ్చారన్నారు. వెలిగొండ పూర్తయినా నీళ్లు రాని ప్రాంతాలు చాలా ఉన్నాయని, అందులో యర్రగొండపాలెం ఉందని చెప్పారు. ప్రజలపై బాధ్యతలేని ప్రభుత్వం ఇదన్నారు. అత్యంత ఎక్కువగా 18 లక్షల 60 వేల మంది జాబ్‌కార్డులు తీసేసిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమన్నారు. విడో పెన్షన్లు పెండింగ్‌, వికలాంగుల పెన్షన్లు రాయడంలో వివక్ష, ఎంక్వయిరీల పేరుతో ఎరివేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మార్కాపురం జిల్లా ఆర్ధికంగా పుష్టి చేయాలంటే మిర్చి యార్డును ఏర్పాటు చేయాలన్నారు. పశ్చిమ ప్రకాశం నుంచి మిర్చిని గుంటూరుకు తీసుకుపోయి అమ్ముకోవాలంటే ట్రాన్స్‌పోర్టు ఎక్కువవుతోందన్నారు. అలాగే శ్రీశైలంతో పాటుగా త్రిపురాంతకం, మార్కాపురం చెన్నకేశవస్వామి దేవాలయాన్ని టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ ప్రాంత సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజలంతా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement