కోటి సంతకాల గర్జన
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాగ్రహం చంద్రబాబు నిర్ణయంపై జనం నిరసన గళం ఎనిమిది నియోజకవర్గాల్లో ఉద్యమంలా సంతకాల సేకరణ జనం నుంచి అనూహ్య స్పందన అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు జిల్లా పార్టీ కార్యాలయానికి చేరిన లక్షలాది ప్రతులు
కోటి సంతకాల ప్రతులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పేదల వైద్య విద్యకు, వైద్యానికి పాతరేసే ప్రభుత్వ నిర్ణయంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే కుటిలయత్నంపై సమరభేరి మోగించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. రెండు నెలలుగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సంతకాలు చేసి సీఎం చంద్రబాబుకు హెచ్చరికలు చేశారు. ఎనిమిది నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ఉద్యమ స్థాయిలో వేల మంది సంతకాల ప్రతులను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. అన్ని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి ప్రతులను ప్రత్యేక వాహనాల్లో జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వాటిని భద్రపరిచారు.
ప్రభుత్వమే నిర్వహించాలి..
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతులను ఒంగోలు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చ్ని నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాల ప్రతుల బాక్సులన్నింటినీ ప్రత్యేక వాహనంలో తరలించారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి ఆ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
నిరంతర ఉద్యమం
సింగరాయకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కోటి సంతకాల ప్రతులను ఒంగోలుకు తరలించారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో వాటిని ఒంగోలుకు తరలించారు. కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ నెంబరు.590 ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నియోజకవర్గంలో 59,504 సంతకాలను సేకరించి ఒంగోలు పార్టీ కార్యాలయానికి తరలించామన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య, ఎస్‌ఈసీ సభ్యుడు డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీసీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
పీపీపీ వద్దే వద్దు..
సంతనూతలపాడు నియోజకవర్గంలోని సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో సేకరించిన 72 వేల సంతకాల ప్రతులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, నాయకులు ర్యాలీగా ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు. మద్దిపాడులోని పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సంతకాల ప్రతులను ఆటోలో నింపి మేరుగు నాగార్జున జెండా ఊపి ఆటోను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు సీఎం చంద్రబాబు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. పీపీపీ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు నిర్వహిస్తే పేద ప్రజలకు వైద్యం, వైద్య విద్య అందదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిశీలకుడు బొట్ల రామారావు, జెడ్పీటీసీ, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ,,సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల నుంచి అనూహ్య స్పందన
మార్కాపురం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్, రూరల్, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి టౌన్, పొదిలి మండలాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు, రైతులు, మహిళలు వ్యవసాయ కూలీలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వమే కళాశాలతో పాటు వైద్యశాలను కూడా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వాహనాన్ని జెండా ఊపి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం కళ్లుతెరచి ప్రజల మనోభావాలను గుర్తించి మెడికల్ కాలేజీని పీపీపీ విధానానికి ఇచ్చిన జీవోను రద్దుచేసి ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కే ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఎస్‌ఈసీ సభ్యుడు వెన్నా హనుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అన్యాయం
మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులను ప్రైవేటీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రజలు ఛీకొడుతున్నారని వైఎస్సార్ సీపీ గిద్దలూరు ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గిద్దలూరు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతమైందన్నారు. 56,500 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారని వెల్లడించారు. బుధవారం ఉదయం సంతకాల ప్రతులతో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం కార్యదర్శి వేమిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
బాబు నిర్ణయం దుర్మార్గం
కనిగిరిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల పత్రాలను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో బుధవారం ఒంగోలుకు తరలించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి బైక్‌లు, కార్లతో ర్యాలీగా బయలుదేరి స్థానిక చెక్‌పోస్టు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దద్దాల మాట్లాడుతూ పేదలకు విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే వాటిని బాబు సర్కార్ ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో 60,230 సంతకాలు సేకరించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు కదిరి బాబూరావు, పీడీసీసీబీ మాజీ చైర్మన్ వైఎం ప్రసాద్‌రెడ్డి(బన్నీ) పాల్గొన్నారు.
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల గర్జన
కోటి సంతకాల గర్జన


