ఎంఎస్‌ఎంఈ పార్క్ స్థలాన్ని పరిశీలించిన జేసీ
కొండపి: మండలంలోని నెన్నూరుపాడు గ్రామంలో సర్వే నంబర్ 433 లో 44.31 ఎకరాల భూమిలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కు స్థలాన్ని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ బుధవారం పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలిచ్చారు. ఆయన వెంట తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీనివాసరావు మండల సర్వేయర్ రాజు, ఏపీ 11సీ జోనల్ మేనేజర్, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
చీమకుర్తి: ప్రకాశం జిల్లా బాలికలు, మహిళల ఖోఖో జట్ల ఎంపిక ఈనెల 12న చీమకుర్తి ప్రభుత్వ హైస్కూలులో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీ.రఘుబాబు, కే హనుమంతురావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 44వ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హాజరయ్యే క్రీడాకారిణులు వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డులను తీసుకొని హాజరు కావాలన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించే బిల్లులను ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా చట్టాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఒంగోలులోని సంఘ జిల్లా కార్యాలయంలో ‘హలో బీసీ–చలో ఢిల్లీ’ వాల్‌పోస్టర్‌ను పలువురు బీసీ నాయకులతో కలసి బుధవారం ఆవిష్కరించారు. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న మహా ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో బీసీలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈనెల 15న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాతో పాటు, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 16న ఓబీసీలకు జనాభా దామాషా మేరకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు, మహిళా రిజర్వేషన్ చట్టసవరణ చేసి ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ విజ్ఞాపన పత్రాలను ప్రముఖులకు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుమ్మరి క్రాంతి కుమార్, జిల్లా మేదర సంఘం అధ్యక్షుడు కేతా చలపతిరావు, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోగుశివుడు, వడ్డెర సంఘం నాయకుడు తన్నీరు శ్రీనివాసరావు, రజక సంఘం నాయకుడు నాగేశ్వరరావు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు భోదనం శ్రీనివాసరావు, జంగం సంఘ నాయకులు దోగిపర్తి సుబ్బారావు, కృష్ట బలిజ సంఘం నాయకుడు బీకే మూర్తి, మేదర సంఘం నాయకుల సిరివెళ్ల బాలకృష్ట, పిల్లి మధు, వీరా చంద్రశేఖర్ శనగవరపు రాజేంద్రప్రసాద్, సైభ మురళి, వాసు, సూర్యబలిజ నాయకులు మద్దెల మురళి పాల్గొన్నారు.
ఎంఎస్‌ఎంఈ పార్క్ స్థలాన్ని పరిశీలించిన జేసీ


