స్మార్ట్‌గా జాప్యం
మార్కాపురం:
జిల్లాలో స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీలో స్మార్ట్‌గా జాప్యం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోనికి వచ్చిన తర్వాత రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్‌కార్డులు ముద్రించారు. వీటి పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాల్లో మొత్తం 6,51,820 రేషన్‌కార్డులు పంపిణీ చేయాలనే లక్ష్యం పెట్టుకోగా ఇంకా 47 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. అత్యధికంగా జిల్లా ఉన్నతాధికారులు ఉండే ఒంగోలులోనే 7054 స్మార్ట్ రేషన్ కార్డులు వినియోగదారులకు అందించాల్సి ఉంది. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సంబంధిత వినియోగదారులకు వీటిని అందించాలి. ఎక్కువగా పశ్చిమ ప్రకాశంలోనే పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు ఆగిపోవడంతో మార్కాపురం గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పలువురు కుటుంబ పోషణ కోసం తెలంగాణ ప్రాంతానికి వలసలు వెళ్లారు. వారందరికీ స్మార్ట్‌కార్డుల పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌కార్డుల పంపిణీని జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, సచివాలయ సిబ్బంది డీలర్ల ద్వారా అందించాలని నిర్ణయించారు. పలుచోట్ల గ్రామ సచివాలయ సిబ్బందికి పనిభారం, కార్డుదారులు వలస పోవడంతో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి పథకానికి రేషన్‌కార్డును లింక్ చేయడంతో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందకుండాపోయే ప్రమాదం ఉంది. తల్లికి వందనం, రైతు భరోసా తదితర పథకాలకు రేషన్‌కార్డే ఆధారం. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డుల పంపిణీపై స్పెషల్ డ్రైవ్ చేస్తే తప్ప లబ్ధిదారులకు అందే అవకాశం లేదు.
నత్తనడకన రేషన్ కార్డుల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా 6,51,820 స్మార్ట్‌కార్డులు
ఒక్క ఒంగోలులోనే 7,054 పెండింగ్
పంపిణీ చేయాల్సిన రేషన్‌కార్డులు 47 వేలు
త్వరలో అందిస్తాం:
మార్కాపురం మండలంలో ఇంకా సుమారు 2 వేల స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. పలువురు తమ స్వగ్రామాల్లో లేకపోవడంతో మా సిబ్బంది అందించలేక పోయారు. త్వరలోనే కార్డులు అందజేస్తాం.
– చిరంజీవి, తహసీల్దార్, మార్కాపురం
స్మార్ట్‌గా జాప్యం


