పీపీపీలు కుప్పకూలుతాయి
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: దేశంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించిన ఇండిగో విమానాలు ఒక్కసారిగా గాలిలోకి ఎగరకుండా మొరాయించాయని, అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవస్థ కుప్ప కూలితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఒంగోలుకు తరలించే వాహనాన్ని ఆయన పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇండిగోలో 65 శాతం వాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటం వలన ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ విమానాలను ఆకస్మికంగా నిలిపేశారని, దీనివలన లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక మంది మానసిక వ్యథకు గురయ్యారన్నారు. ఇతర దేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు తమ ప్రయాణాలను నిలుపుకోవాల్సి వచ్చిందని అన్నారు. చంద్రబాబు పీపీపీ పద్ధతిలో అమ్మకానికి పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ తమకు చేతకాదని ప్రైవేటు వ్యక్తులు చేతులు ఎత్తివేస్తే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు, శస్త్ర చికిత్స చేయించుకోవటానికి సిద్ధంగా ఉన్న వారితో పాటు లక్షలాది మంది మెడికో విద్యార్థుల పరిస్థితి ఎలాగుంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, విద్యార్థుల పరిస్థితి గుర్తించి అన్ని వర్గాలకు చెందిన పేద పిల్లల తల్లిదండ్రులు కంటున్న మెడికో కలలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించారని, వాటి నిర్మాణాలకు కోట్లాది రూపాయలు కేటాయించి పనులు వేగవంతం చేయించారన్నారు. వాటిలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయించారని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన 18 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క మెడికల్ కాలేజీ మంజూరు చేయించలేకపోయారని, ఉన్న కాలేజీలను నిర్వీర్యం చేసేందుకు పథకాలు పన్నుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తరువాత రాష్ట్రంలో రెడ్‌బుక్ సంస్కృతిని తీసుకొచ్చి అల్లకల్లోలం చేస్తున్నారని, ఎక్కడ చూసినా దోపిడీలు, హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. నియోజకవర్గం మొత్తం మీద 61,190 సంతకాలను సేకరించగలిగామని అన్నారు.


