మార్కాపురంలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి
● ఆటోడ్రైవర్ల నిరసన ప్రదర్శన
మార్కాపురంలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆటో డ్రైవర్లు గురువారం పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మార్కాపురం ఆర్టీఓ కార్యాలయంలో జారీ చేస్తున్న ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను ఈ నెల 1వ తేదీ నుంచి నంద్యాల లేదా గుంటూరుకు మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు డీకేయం రఫీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను మార్కాపురం నుంచి నంద్యాలకు మార్చడం మంచిది కాదన్నారు. ఇప్పటికే బాడుగలు లేక కిస్తీలు కట్టలేక కుటుంబాలను పోషించుకోలేక అవస్థలు పడుతున్నామని అన్నారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని మార్కాపురంలోనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం నుంచి బస్టాండు వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అందె నాసరయ్య, తదితరులు పాల్గొన్నారు.


